ముగిసిన ప్రచారం
● రేపే మూడో విడత పంచాయతీ ఎన్నికలు
● పోల్ మేనేజ్‌మెంట్‌పై అభ్యర్థుల దృష్టి
● జోరుగా మద్యం, డబ్బుల పంపిణీ
అచ్చంపేట: గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఇన్నాళ్లు ప్రచారంలో హోరెత్తించిన అభ్యర్థులు ఇక పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించారు. ఓటరును నేరుగా ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఒక్క రోజు మాత్రమే మిగలగా.. బుధవారం పోలింగ్ జరగనుంది. దీంతో పార్టీల రహితంగా జరిగే ఎన్నికలే అయినప్పటికీ అభ్యర్థులు మాత్రం పార్టీల జెండాలతోనే గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. అయితే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ పోటీ చేస్తుండటంతో ఇద్దరు, ముగ్గురు చొప్పున ఆ పార్టీ అభ్యర్థులే బరిలో ఉండగా.. కొన్నిచోట్ల బీఆర్‌ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు కలిసి పోటీలో ఉన్నాయి. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ రెబల్స్‌కు బీఆర్‌ఎస్, బీజేపీ మద్దతు ఇవ్వడం పోటీల్లో ఆసక్తి రేపుతోంది. ఈ వ్యవహారం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది.
ఇక నేరుగా ప్రసన్నం..
ఎన్నికల నియమావళి ప్రకారం అభ్యర్థులు ప్రచారానికి ముగింపు పలికారు. ఇక పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలుస్తూ మద్దతు ఇవ్వాలని.. తనకే ఓటు వేయాలని కోరుతున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెర లేపి.. డబ్బులు పంపిణీ మొదలైంది. ఏజెన్సీ ప్రాంతంలో కొన్నిచోట్ల రూ.500 నుంచి వెయ్యి, మరికొన్ని చోట్ల రూ.2 వేల వరకు పంచుతున్నారు. మరోవైపు మద్యం పంపకాలు, విందులు జోరందుకున్నాయి. మంగళవారం ఒక్కరోజే సమయం ఉండటం, తెల్లవారితే పోలింగ్ ఉండటంతో అభ్యర్థులు, వారి అనుచరులు చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. గెలుపే దిశగా పావులు కదుపుతున్నారు.


