ఇంటికే ‘పోల్ చీటీ’
● ఓటింగ్ శాతం పెంచేందుకుప్రభుత్వం కసరత్తు
● బీఎల్‌ఓల ద్వారా
నేరుగా ఓటర్లకు అందజేత
అచ్చంపేట: పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఓటర్లకు పోలింగ్ సిప్ల్‌లను అందజేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు నేరుగా పోల్ చీటీలు అందజేస్తున్నారు. ఈ నెల 17న మూడో విడత ఎన్నికలు జరగనున్న అచ్చంపేట, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, చారకొండ మండలాల్లో మరో రెండు రోజుల్లో పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేసిన యంత్రాంగం ఈ దిశగా ముందుకు సాగుతోంది.
నిరక్షరాస్యులు.. వృద్ధులు
ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోల్ చీటీలు దోహదపడుతాయి. వీటిని గతంలో రాజకీయ పార్టీలే ముంద్రించి ఎన్నికలకు ముందు రోజున ప్రచారం చేసుకుంటూ ఓటర్లకు అందించేవారు. అయితే వీరు ఓటర్లు అందరికీ ఇచ్చేవారు కాదు. దీంతో తమ పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలియక ఓటర్లు పోలింగ్ రోజున ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ముఖ్యంగా నిరక్షరాస్యులు, వృద్ధులు ఎక్కువగా సతమతమయ్యేవారు. ఈ క్రమంలో ఓటర్లు సులువుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘమే పోల్ చీటీలను అందజేస్తోంది.
ఓటర్లు ఇళ్లలో లేకుంటే..
సిబ్బంది ఇళ్లకు వెళ్లిన సమయంలో లేనివారి పోల్ స్లిప్‌లు పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ కేంద్రం వద్ద అందుబాటులో ఉంచుతారు. వారితోపాటు చిరునామాలో లేనివారివి, డూప్లికేట్లుగా భావించిన వారివి అందుబాటులో ఉంటాయి. అక్కడ తగిన ఆధారం చూపి పోల్ చీటీ తీసుకోవచ్చు. పోల్ చీటీ లేకపోయినా ఎన్నికల సంఘం పేర్కొన్న 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటరు జాబితాలో పేరుంటే ఓటు వేసుకోవచ్చు.


