శాంతిభద్రతల పరిరక్షణకే పోలీస్ కవాతు: డీఎస్పీ
చారకొండ: శాంతిభద్రతల పరిరక్షణ కోసమే పోలీసుల కవాతు నిర్వహిస్తున్నామని కల్వకుర్తి డీఎస్పీ సాయిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల మూడో విడత ప్రచారం ముగింపు సందర్భంగా సోమవారం సాయంత్రం మండల కేంద్రంలో కల్వకుర్తి డీఎస్పీతోపాటు వెల్దండ సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐ వీరబాబు ఆధ్వర్యంలో పోలీస్ బలగాలతో మండల కేంద్రంలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ స్థానిక ఓటర్లతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకొనేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. అభ్యర్థులు ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా.. శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ల తమ ఓటుహక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో వివిధ మండలాల ఎస్‌ఐలు కురుమూర్తి, కృష్ణదేవ్, రాజశేఖర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


