బాలికలకు స్వీయ రక్షణ
కందనూలు: సమాజంలో ఎదురయ్యే సంఘటనలను ఎదుర్కొనేలా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కరాటే శిక్షణకు శ్రీకారం చుట్టింది. బాలికలు, మహిళల రక్షణ కోసం కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం విద్యార్థి దశలోనే బాలికలకు ఆత్మవిశ్వాసం పెరిగేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఆత్మరక్షణ విద్య (కరాటే) నేర్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలో 22 పీఎంశ్రీ పాఠశాలలను ఎంపిక చేసింది. ఈ పాఠశాలల్లో బాలికలకు కరాటే, కుంగ్‌ఫూ, జూడో వంటి విద్య నేర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. కేవలం శిక్షణకే కాకుండా ఉత్తీర్ణత పరీక్ష కూడా రాయించి ధ్రువపత్రాలు అందించనుంది.
ఆపద కాలంలో..
ప్రతిరోజు మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో బాలికలు తమను తాము రక్షించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రత్యేకంగా కరాటే, కుంగ్‌ఫూ, జూడో వంటి ఆత్మరక్షణ శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ శిక్షణ ద్వారా బాలికలు అత్యవసర సమయాల్లో తమను తాము రక్షించుకునేందుకు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది.
మూడు నెలలపాటు శిక్షణ..
జిల్లాలో 22 పాఠశాలలు పీఎంశ్రీ కింద ఎంపికయ్యాయి. ఇందులో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఆత్మరక్షణ విద్య అమలు చేస్తున్నారు. ఇందుకు ఒక్కో పాఠశాలకు రూ.30 వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. వారానికి ఆరుసార్లు రోజు సాయంత్రం మూడు నెలలపాటు 72 తరగతులు నిర్వహించి శిక్షణ ఇవ్వనున్నారు. 50 మందిలోపు విద్యార్థినులు ఉంటే రూ.15 వేల వేతనం, 50 కంటే ఎక్కువ ఉంటే రూ.30 వేల గౌరవ వేతనాన్ని శిక్షకులకు అందించనున్నారు. ఈ శిక్షణ నేర్పించేందుకు మహిళా శిక్షకురాలను జిల్లా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు.
ఆత్మవిశ్వాసం పెంపొందించే
దిశగా కరాటే శిక్షణ
జిల్లాలోని 22 పీఎంశ్రీ బడుల్లో అమలు
ఆరు నుంచి పదో తరగతి
విద్యార్థినులకు అవకాశం
ప్రతిరోజు సాయంత్రం గంటపాటు సాధన


