కుల ధ్రువపత్రాల కోసం తిప్పలు
సాక్షి, నాగర్‌కర్నూల్: కుల ధ్రువపత్రాల కోసం విద్యార్థులు రోజుల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తాజాగా ఎస్సీ కుల సర్టిఫికెట్ జారీ కోసం రెవెన్యూ అధికారులు కుటుంబసభ్యుల కుల సర్టిఫికెట్ సమర్పించాలని చెబుతున్నారు. దీంతో ఇప్పటివరకు సర్టిఫికెట్ లేని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ కుల సర్టిఫికెట్ కోసం అఫిడవిట్ అవసరం లేకపోయినా విద్యార్థులంతా డబ్బులు వెచ్చించి అఫిడవిట్ సమర్పిస్తున్నారు. అధికారులు అఫిడవిట్‌తో పాటు కుటుంబ సభ్యులకు గతంలో జారీ చేసిన కుల సర్టిఫికెట్ ఉంటేనే విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తు కోసం ఈ నెల 8 వరకే సమయం ఉండటంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు రెవెన్యూ కార్యాలయాలకు వస్తున్నారు. అయితే సర్టిఫికెట్ల జారీకి అధికారులు తిరస్కరిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై నాగర్‌కర్నూల్ ఆర్‌ఐ అబిద్ అలీని వివరణ కోరగా.. అఫిడవిట్ అవసరం లేదని, పాత కుల ధ్రువపత్రం మాత్రం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని చెప్పారు.
తహసీల్దార్ కార్యాలయాల్లో
విద్యార్థుల బారులు


