నిబంధనల మేరకే ఏకగ్రీవాలు
సాక్షి, నాగర్‌కర్నూల్: ‘జిల్లాలోని గ్రామపంచాయ తీల్లో ఎన్నికల నిబంధనల ప్రకారం ఏకగ్రీవాలు సజావుగా జరిగేలా దృష్టిసారించాం. ఏకగ్రీవాలపై ప్రత్యేకంగా విచారణ జరిపిన తర్వాతే ప్రకటిస్తున్నాం. మొదటి విడతలో ఇప్పటివరకు 14 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. ఎక్కడైనా ప్రలోభాలకు గురిచేసినా, అభ్యర్థులపై ఒత్తిడి చేసినా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలుచేస్తున్నాం. గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం.’ అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాట్లపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
సాక్షి: పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎలా
కొనసాగుతోంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
కలెక్టర్: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తున్నాం. మొదటి విడత నామినేషన్లు పూర్తికాగా.. 14 జీపీలు ఏకగ్రీమయ్యాయి. వీటిలో 10 జీపీల్లో ఉపసర్పంచ్ ఎన్నిక సైతం పూర్తయ్యింది. రెండు, మూడు విడతల్లో నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 11, 14, 17 తేదీల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తుండగా.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల్లో శిక్షణ ఇచ్చాం. ప్రిసైడింగ్ ఆఫీసర్లకు మరోసారి శిక్షణ ఇవ్వనున్నాం. పోస్టల్ బ్యాలెట్‌తో సహా ఎన్నికల సామగ్రిని సిద్ధం చేశాం.
సాక్షి: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
కలెక్టర్: జిల్లాలో మొత్తం 4,102 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశాం. 11,231 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం 400 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. వీటి పరిధిలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా మైక్రో అబ్జర్వర్లను నియమించాం. పోలింగ్ తీరును వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం.
సాక్షి: ఎన్నికల కోడ్ అమలుకు
ఏ చర్యలు చేపట్టారు?
కలెక్టర్: జిల్లాలో ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉల్లంఘనలకు సంబంధించి 230201 నంబర్‌కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులపై 3 గంటల్లోగా చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశాం. మొత్తం 24 గంటల్లోగా సమస్య పరిష్కారం అవుతుంది. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా టీ– పోల్ యాప్ అందుబాటులో ఉంది. జిల్లాలో మూడు చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటుచేశాం. మరో 20 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పనిచేస్తున్నాయి. చెక్‌పోస్టు తనిఖీల్లో ఇప్పటివరకు రూ. 14లక్షల విలువైన మద్యం, రూ. 53వేల నగదు స్వాధీనం చేసుకున్నాం. అభ్యర్థుల ప్రచార ఖర్చులు, సోషల్ మీడియా ప్రచారంపై సైతం దృష్టిసారిస్తున్నాం.
సాక్షి: ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ జనాభా లేని గ్రామాల్లో సర్పంచులు ఎన్నిక కాలేకపోతున్నారు. ఆయా గ్రామాల పరిస్థితి
ఏంటి?
కలెక్టర్: ఏజెన్సీ ఏరియా పరిధిలో అమ్రాబాద్ మండలంలోని నాలుగు గ్రామాల్లో ఎస్టీ జనాభా లేదు. అయితే ఏజెన్సీ పరిధిలో స్థానాలను ఎస్టీలకే కేటాయించాల్సి ఉంటుంది. దీనిపై ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి నివేదించాం.
సాక్షి: నామినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది. అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణకు ఎలాంటి కారణాలు ఉంటాయి?
కలెక్టర్: నామినేషన్ల ప్రక్రియపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాం. ఇందుకోసం క్లస్టర్ కేంద్రాల్లో పంచాయతీ కార్యదర్శులతో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేశాం. సాధారణంగా రిజర్వుడ్ స్థానాల్లో ఇతరులు నామినేషన్ వేయడం.. కుల ధృవీకరణ సర్టిఫికేట్ సమర్పించకపోవడం.. ఫారాన్ని పూర్తిగా నింపకపోవడం.. ప్రతిపాదకుల పేర్లు ఓటరు జాబితాలో లేకపోవడం వంటి కారణాల వల్ల నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి. నామినేషన్ సమయం సాయంత్రం 5 గంటల తర్వాత సైతం క్యూలో ఉన్న అభ్యర్థులందరి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నాం.
సాక్షి: ఎన్నికల్లో పోలింగ్‌శాతాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్: పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు పూర్తిచేశాం. ఎన్నికల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. అర్హులందరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలి.
పంచాయతీ ఎన్నికల తీరుతెన్నులపై నిశిత పరిశీలన
ఏకగ్రీవం కోసం బలవంతం చేస్తే చర్యలు
జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ బదావత్ సంతోష్
సాక్షి: పంచాయతీల ఏకగ్రీవ ఎన్నికలపై ఎలాంటి నిబంధనలు ఉన్నాయి.. ప్రలోభాలపై ఫిర్యాదులు అందుతున్నాయా?
కలెక్టర్: మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు 14 జీపీల్లో సింగిల్ నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమయ్యాయి. వీటిలో రెండు చోట్ల ఫిర్యాదులు వచ్చాయి. వెల్దండ మండలంలోని రాఘాయిపల్లి, బొల్గట్‌తండాల్లో ఫిర్యాదులు రావడంతో ఆర్డీఓ, తహసీల్దార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాం. ఆయా చోట్ల ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. సింగిల్ నామినేషన్ వచ్చిన చోట అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నాం. ఉపసంహరణ చేసుకున్న అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తీసుకుని ఎన్‌ఓసీ జారీ చేశాకే ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నాం. ఏకగ్రీవం కోసం ఎవరైనా బలవంతం చేస్తే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
నిబంధనల మేరకే ఏకగ్రీవాలు


