ముగిసిన నామినేషన్ల ఘట్టం
అచ్చంపేట: జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ శుక్రవారం ముగిసింది. అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, చారకొండ, లింగాల, పద, ఉప్పునుంతల మండలాల్లో 158 సర్పంచ్, 1,364 వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిర్ణీత సమయం దాటినప్పటికీ.. క్యూలో ఉండటంతో వారిని అనుమతించారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ పలుచోట్ల అర్ధరాత్రి వరకు కొనసాగింది. చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 656 వార్డు స్థానాలకు 2,190 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా మండలాల్లో చివరి రోజు దాఖలైన నామినేషన్ల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు.
నేడు రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ
రెండో విడత నామినేషన్ల ఉపసంహరణకు శనివారం మధ్యాహ్నం 3గంటల వరకు సమయం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు పోటీ చేయడంపై కసరత్తు చేస్తున్నారు. గెలుపోటములపై అంచనాలు వేస్తూ.. తర్జనభర్జన పడుతున్నారు. పోటీ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది.. అనుకూలంగా ఉన్న ఓట్లు.. ప్రత్యర్థులకు పడే ఓట్ల వివరాలు సేకరిస్తున్నారు. పోటీ చేసేందుకు సిద్ధపడిన కొందరు ప్రత్యర్థులను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేలా పెద్దలతో సంప్రదింపులు, రాయబారాలు కొనసాగిస్తున్నారు. రెండో విడత బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, తిమ్మాజిపేట, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో 151 సర్పంచ్, 1,412 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు అభ్యర్థులు చేసిన ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది.
ఉందామా.. తప్పుకొందామా?
సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేసిన డమ్మీ అభ్యర్థులతో పాటు రెబల్స్‌కు ఎన్నికలు వరంగా మారాయి. తమకు అధిక సంఖ్యలో ఓటర్ల మద్దతు ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. పోటీలో ఉన్న నాయకులు ఉపసంహరణ చేసుకోవాలని కోరినప్పుడు, డమ్మీలు మొదట ససేమిరా అంటూనే ఆపై తమ మనసులోని కోరిక నేరుగా చేప్పేస్తున్నారు. మొదట పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ.. సాగే చర్చలో బేరసారాలు చేస్తున్నారు. చివరకు ఎంతో కొంత సెటిల్ చేసుకుని నామినేషన్లు ఉపసంహరించుకోవడం పరిపాటిగా మారింది. మరికొంత మంది తమతో మంతనాలు జరిపేందుకు ఎవరు రాకుంటే.. వారే స్వయంగా అభ్యర్థుల వద్దకు వెళ్లి డబ్బులిస్తే పోటీ నుంచి తప్పుకొంటామని బేరసారాలకు దిగుతున్నారు. గెలుపుపై ఆశలు పెట్టుకున్న అవతలి అభ్యర్థులు కొంతలో కొంతనైనా ముట్టజెప్పకపోతారా అని చూస్తున్నారు. మొదటి విడతలో ఇలాంటివి చోటు చేసుకోగా.. రెండు, మూడో విడతల్లోనూ ఈ వ్యవహారం కొనసాగే అవకాశం ఉంది.
మండలం జీపీలు సర్పంచ్ వార్డులు దాఖలైన
నామినేషన్లు నామినేషన్లు
అచ్చంపేట 38 150 312 350
అమ్రాబాద్ 20 90 182 275
బల్మూర్ 23 106 208 464
చారకొండ 17 78 142 267
లింగాల 23 85 206 310
పదర 10 63 92 194
ఉప్పునుంతల 27 84 222 330
మూడో విడత చివరి రోజు
సర్పంచ్‌కు 656,
వార్డులకు 2,190 నామినేషన్లు


