ప్రజలకు అందుబాటులో ఉండాలి
నాగర్‌కర్నూల్ రూరల్: ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందించాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో కలిసి పుర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణంలో వర్షపు నీరు ఏయే కాలనీల్లో నిలిచిందో గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని, త్వరితగతిన సేవలు అందించేందుకు నిమగ్నం కావాలని సూచించారు. అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. పుర ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
సగరుల సమస్యల పరిష్కారానికి కృషి..
సగరుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి అన్నారు. మండలంలోని తూడుకుర్తిలో నిర్మించిన సగరుల కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణరంగ కార్మికులుగా జీవనం సాగిస్తున్న సగరుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. సగరులు రాజకీయంగా ఎదగడానికి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. రాజకీయంగా ఎదగాలంటే సగరులను బీసీ–డి నుండి ఏ కేటగిరికి మార్చాలని పలువురు సగరులు కోరారు. కార్యక్రమంలో నాయకులు తిరుపతయ్య, శ్రీనివాసులు, ముత్యాలు, హరికృష్ణ, గౌరక్క, సత్యం, ఆంజనేయులు ఎంపీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ నిర్మల, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


