కార్తీక దీపం.. నయనానందం
సోమశిల సోమేశ్వరాలయంలో కోటి దీపారాదనలో పాల్గొన్న భక్తులు
శివ పార్వతులకు పరమ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతి ఇంటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శివాలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా.. రాత్రి కార్తీక దీపాలు వెలిగించి ఆరాధించారు. జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు పాతాళగంగ వద్ద కార్తీక స్నానాలు ఆచరించి మల్లికార్జునస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ఉమామహేశ్వర ఆలయంలో ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. ఆలయం ఎదుట ధ్వజస్తంభం వద్ద మహిళళలు మట్టి ప్రమిదలు, ఉసిరి కాయలతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
● కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో భక్తుల రద్దీ కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కృష్ణానదిలో స్నానాలు ఆచరించి దీపాలు వదిలారు. అలాగే ప్రధాన ఆలయాను దర్శించుకొని ఆవరణలో దీపాలు వెలిగించారు. శ్రీ లలితాంబిక సోమేశ్వరాలయంలో కొల్లాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కోటి దీపారాదన కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులతో పాటు వివిధ ప్రాంతాల మహిళ భక్తులు పెద్దఎత్తున పాల్గొని దీపాలు వెలిగించారు. అలాగే జిల్లాలోని పలు ఆలయాల్లో సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించగా భక్తులు భారీగా పాల్గొన్నారు.
– సాక్షి నెట్‌వర్క్
కార్తీక దీపం.. నయనానందం
కార్తీక దీపం.. నయనానందం


