ఇంటర్ కళాశాలల్లో తనిఖీలు
నాగర్‌కర్నూల్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్ది ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సంబంధిత అధికారులు కళాశాలలను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటరమణ ఈ నెల 15 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలను తనిఖీ చేయనున్నారు. ఆయా కళాశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు, వార్షిక పరీక్షలు దగ్గరపడుతుండటంతో విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతున్నారనే వివరాలను విద్యార్థులతో మాట్లాడి తెలుసుకుంటున్నారు. తనిఖీ పూర్తయిన వెంటనే సదరు నివేదికను ఇంటర్ బోర్డులకు అందజేస్తున్నారు.
హాజరు, సిలబస్‌పై ప్రత్యేక దృష్టి..
తనిఖీల్లో ప్రధానంగా విద్యార్థుల వివరాల నమోదు సరిగా ఉందా, విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయా, విద్యార్థుల హాజరు, సిలబస్ ఎంత వరకు పూర్తయింది అనే అంశాలను పరిశీలిస్తున్నారు. వార్షిక పరీక్షల సమయం సమీపిస్తున్నందున ప్రణాళిక రూపొందించి సిలబస్ పూర్తి చేస్తున్నారా అనే అంశాలతో పాటు పరీక్ష కేంద్రాలుగా ఉన్న కళాశాలల్లో సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా అనే వివరాలు చూస్తున్నారు. దీంతో పరీక్ష సమయం వరకు విద్యార్థులకు అవసరమైన ప్రణాళికలను రూపొందించి ఉత్తమ ఫలితాలు సాధించేలా సన్నద్ధం చేసే అవకాశం ఉంటుంది.
ప్రత్యేక ట్యాబ్‌లో..
జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వ, కేజీవీబీ, బీసీ సంక్షేమ కళాశాలలు అన్నీ కలిపి 87 ఉన్నాయి. ఈ నెల 15 వరకు అన్ని కళాశాలల తనిఖీ పూర్తి చేయనున్నారు. సంబంధించి అధికారులు రోజువారీ తనిఖీల నివేదికను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో కళాశాల వద్దే నమోదు చేసి ఇంటర్ బోర్డుకు పంపిస్తున్నారు. పరిశీలన సమయంలో విద్యార్థులతో మాట్లాడి ఏమైనా సమస్యలుంటే వాటిని సైతం తెలుసుకొని నివేదికల రూపంలో పంపనున్నారు. ఇటీవల ప్రభుత్వ కళాశాలలకు నిధులు మంజూరు కావడంతో వాటిని ఎలా ఖర్చు చేశారు, ఎలాంటి సౌకర్యాల కోసం వినియోగించారు అనే విషయాలను సైతం ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. నిధులను సరైన రీతిలో ఖర్చు చేశారా లేదా అనే విషయాలను సైతం విచారణ చేయనున్నారు.
ఉత్తమ ఫలితాల సాధనకే..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలలను తనిఖీ చేస్తున్నాం. తనిఖీల సమయంలో పరిశీలించిన అంశాలను ఆన్‌లైన్‌లో ఇంటర్‌బోర్డు అధికారులకు నివేదిస్తున్నాం. విద్యార్థుల హాజరు, సిలబస్ ఎంత వరకు పూర్తయిందనే విషయాలను పరిశీలిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – వెంకటరమణ,
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి
ప్రభుత్వ, ప్రైవేట్‌లలో
ఈ నెల 15 వరకు కొనసాగింపు
విద్యార్థుల హాజరు, సిలబస్ పూర్తిపై ప్రత్యేక దృష్టి
బోర్డుకు ఎప్పటికప్పుడు తనిఖీల నివేదిక
జిల్లాలో 87 జూనియర్ కాలేజీలు


