
బాధితులకు సత్వర న్యాయం జరగాలి
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్టేషన్‌లో పలు రికార్డులను పరిశీలించి.. పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు. విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం వహించకూడదని.. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులపై నిర్లక్ష్యం వహించొద్దన్నారు. పోలీసు శాఖపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వ్యవహరించాలని సూచించారు. అదే విధంగా పెండింగ్ కేసులను త్వరగా పూర్తిచేయాలన్నారు. ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ గోవర్దన్ తదితరులు ఉన్నారు.
● దీపావళి పర్వదినం సందర్భంగా ఏర్పాటుచేసే బాణాసంచా దుకాణాలకు తప్పనిసరిగా అన్ని అనుమతులు పొందాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నిమాపకశాఖ, రెవెన్యూ, సంబంధిత పోలీస్‌స్టేషన్ నుంచి అనుమతులతో పాటు సదరు గ్రామపంచాయతీ లేదా మున్సిపాలిటీ నుంచి లైసెన్స్ పొందాలని దుకాణదారులకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటుచేసే దుకాణాలన్నీ ఒకే ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలన్నారు. దుకాణాల వద్ద విధిగా నీరు, ఇసుక అందుబాటులో ఉండాలన్నారు. ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఎలాంటి ప్రాణ ,ఆస్తినష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీసుశాఖ సూచనలు పాటించకుండా బాణాసంచా దుకాణాలు ఏర్పాటుచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాణాసంచా కాల్చే సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని.. పిల్లలు పెద్దల సంరక్షణలో బాణాసంచా కాల్చాలని సూచించారు.