
నల్లమలలో ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల
అచ్చంపేట/మన్ననూర్: నల్లమలలో ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం అచ్చంపేట మండలం హజీపూర్ సమీపంలో 45 ఎకరాల భూమిని రాష్ట్ర ఆయుర్వేదిక్ రీజనల్ డైరెక్టర్ డా.రవినాయక్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిలోని మృగవాణి రెస్టారెంట్ ప్రాంగణంలో వారు విలేకర్లతో మాట్లాడారు. నల్లమల అనగానే వనమూలికలు, ఔషధ మొక్కలకు నిలయమని గుర్తుకు వస్తుందన్నారు. ఈ ప్రాంతంలో ఆయుర్వేద కళాశాల ఏర్పాటుతో ఇక్కడి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో వస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, ప్రొఫెసర్ డా.ప్రవీణ్, జిల్లా ఆయుర్వేదిక్ జోనల్ ఇన్‌చార్జి గోపాల్‌నాయక్, డిప్యూటీ తహసీల్దార్ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.
పోషకాహారంతోనే
సంపూర్ణ అరోగ్యం
బల్మూర్/మన్ననూర్: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి అంగన్‌వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీడబ్ల్యూఓ రాజేశ్వరి సూచించారు. బల్మూరు, మన్ననూర్ రైతువేదికల్లో బుధవారం నిర్వహించిన పోషణ మాసం ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు ఆకుకూరలు, పండ్లు, గుడ్లు వంటి బలమైన ఆహరం తీసుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అంగన్‌వాడీ టీచర్లపై ఉందన్నారు. ప్రధానంగా కిషోర బాలికల వ్యక్తిగత శుభ్రతపై తల్లిదండ్రులు చొరవ తీసుకునేలా చూడాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించారు. చిన్నారులతో అన్నప్రాసన చేయించారు. బల్మూర్ కేజీబీవీలో విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. మండల వైధ్యాధికారి సుధాకర్, సీడీపీఓ దమయంతి, ఏసీడీపీఓ కమల, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ పార్వతి, సూపర్‌వైజర్లు నిర్మల, బి.పాషా, గిరిజ, సునీత, పద్మావతి, అమృత, సువర్ణ, జ్యోత్స్న, అనిత, స్వర్ణలత పాల్గొన్నారు.