
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
● కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్: విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బదావత్ సంతోష్ హెచ్చరించారు. జిల్లా పరిపాలనలో సమర్థత పెంపొందించడమే కాకుండా.. ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బుధవారం నాగర్‌కర్నూల్ ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగుల సమయపాలన, సకాలంలో హాజరుకాని ఉద్యోగుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల రికార్డులను ఆయన పరిశీలించారు. భూ భారతిలో నమోదైన దరఖాస్తులపై సమీక్షించారు. భూ వివాదాలు లేకుండా, రికార్డులు కచ్చితంగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదే విధంగా కలెక్టరేట్‌లోని అన్ని విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఉద్యోగుల హాజరు బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయడం తప్పనిసరి అని.. పాత పద్ధతిలో నిర్లక్ష్యంగా హాజరు నమోదు చేయడం అనుమతించబోమని తెలిపారు. కలెక్టరేట్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, రెవెన్యూ రికార్డుల భద్రతపై సమీక్షించారు. ప్రజలకు వేగవంతంగా సేవలు అందించే విధంగా అన్ని విభాగాలు చురుకుగా ఉండాలని అధికారులకు సూచించారు.