అంగన్‌వాడీ.. పోషకాల గని | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ.. పోషకాల గని

Oct 11 2025 7:56 AM | Updated on Oct 11 2025 7:56 AM

అంగన్

అంగన్‌వాడీ.. పోషకాల గని

ప్రత్యేక దృష్టిపెట్టాం..

జిల్లాలోని 89 కేంద్రాల్లో కిచెన్‌ గార్డెన్ల ఏర్పాటు

ఒక్కో కేంద్రానికి రూ.10 వేలు..

ఆకుకూరలు, కూరగాయల

సాగుకు ప్రోత్సాహం

చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించేందుకు కృషి

సంపూర్ణ పౌష్టికాహారమే

లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషక విలువలతో కూడిన సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలతో భోజనం అందించాలనే లక్ష్యంతో కిచెన్‌ గార్డెన్లు ఏర్పాటు చేశాం. వీటి నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి సాగు చేస్తున్నాం. వీటి ద్వారా వచ్చే కూరగాయలు, ఆకుకూరలతోనే పౌష్టికాహారం వండి పెడుతున్నాం. – రాజేశ్వరి, డీడబ్ల్యూఓ

కందనూలు: జిల్లాలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే కేంద్రాల్లో అందించే ఆహారంలో వినియోగించే ఆకుకూరలు, కూరగాయలు అక్కడే పండించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కిచెన్‌ గార్డెన్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. ఇక్కడే పండించిన తాజా కూరగాయలతో చిన్నారులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు కృషిచేస్తోంది.

ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు..

జిల్లాలో ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులుండగా అందులో 1,132 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 5,291 మంది గర్భిణులు, 3,180 మంది బాలింతలు, సున్నా నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 44,404 మంది ఉన్నారు. వీరికి ప్రస్తుతం కూరగాయలు కొనుగోలు చేసి వంట తయారు చేసి అందిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు పెరిగిన సందర్భంలో ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోవడం లేదు. దీంతో కొన్ని సందర్భాల్లో పౌష్టికరమైన ఆహారం అందక ఇబ్బందిపడిన సందర్భాలున్నాయి. వీటిని గుర్తించిన ప్రభుత్వం సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు పండించుకొని వంటకాల్లో ఉపయోగించుకోవడం ద్వారా ఎక్కడా లోటుపాట్లు ఉండవని గుర్తించి ఆ దిశగా జిల్లాలో 89 కేంద్రాల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కిచెన్‌ గార్డెన్‌లలో కూరగాయల మొక్కలు, ఆకుకూరల విత్తనాలు నాటి పందిళ్లు ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ బాధ్యత అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు, ఆయాలకు అప్పగించారు. కిచెన్‌ గార్డెన్‌లలో బెండకాయ, వంకాయ, సొరకాయ, మెంతికూర, పాలకూర, కొత్తిమీర లాంటి పోషకాలతో కూడిన కూరగాయలు, ఆకుకూరలు పండించి.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వండి పెడుతున్నారు.

కిచెన్‌ గార్డెన్ల ఏర్పాటుకు ఎంపికై న ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నిధులను విత్తనాల కొనుగోలు, కుండీలు, మట్టి, ఇతర పరికరాల కొనుగోలుకు వెచ్చించాల్సి ఉంటుంది. నారు పెట్టేందుకు రూ.3 వేలు, రవాణా ఖర్చులకు రూ.వెయ్యి, విత్తనాలు నాటేందుకు, భూమి సిద్ధం చేసేందుకు రూ.వెయ్యి, నీటి వసతి, పంట నిర్వహణ, ఇతరత్రా అవసరాల కోసం రూ.5 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అంగన్‌వాడీ.. పోషకాల గని 1
1/1

అంగన్‌వాడీ.. పోషకాల గని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement