
బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానిదే అంతిమ విజయం
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో స్థానిక సంస్థల స్థానాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విషయంలో అంతిమంగా ప్రభుత్వమే విజయం సాధిస్తుందని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ పరిశీలకులు నారాయణస్వామి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక పరిశీలకుడిగా వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా కులగణన చేపట్టి బీసీల లెక్క తేల్చిందని, దానిని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఆరోపించారు. ప్రస్తుతం హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉందని, అంతిమంగా బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఓబీసీలకు 69 శాతం, కర్ణాటకలో 52 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, తెలంగాణలోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డిని అభినందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాల్లో డీసీసీ పదవుల కోసం ఆశావహులతోపాటు బ్లాక్ కాంగ్రెస్, మండల అధ్యక్షుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నామని, పారదర్శకంగా పార్టీ కోసం పనిచేసినవారికే డీసీసీ పదవులను అధిష్టానానికి సిఫార్సు చేస్తామన్నారు. ఆయన వెంట ఏఐసీసీ పరిశీలకులు నెమళ్ల శ్రీనివాస్, కోటేశ్వరరావు, శ్రీకాంత్‌గౌడ్, సంధ్యారెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి తదితరులున్నారు.
పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ పరిశీలకులు నారాయణస్వామి