
విద్యార్థులకు చేయూత అందిద్దాం
కల్వకుర్తి రూరల్: పేద విద్యార్థులకు చేయూత అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ప్రశాంతి సన్నిధి ఆవరణలో నిర్వహించిన దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. సామాజిక సేవలో తమదైన ముద్ర వేస్తున్న సేవాసంస్థలు విద్యార్థులకు అండగా నిలవాలని కోరారు. అనంతరం సత్యసాయి సేవాసంస్థల జాతీయ కార్యదర్శి రత్నాకర్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు తోడ్పాటు అందించేందుకు సత్యసాయి సేవాసంస్థలు ముందుంటాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించే ఆలోచన చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు సాయి భక్తులను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు విజయకుమార్‌రెడ్డి, ఆనంద్‌కుమార్, జూలూరు రమేశ్‌బాబు, భూపతిరెడ్డి, మిరియాల శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, బచ్చు రామకృష్ణ, సంజీవ్ యాదవ్, సంతు యాదవ్, గుబ్బా ఈశ్వరయ్య, వెంకటేశ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.