
బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడం సిగ్గుచేటు
కల్వకుర్తి టౌన్: బీసీ జనాభాకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తే అడ్డుకోవాలని చూడటం సిగ్గుచేటని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అన్నారు. శనివారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే ఇతర పార్టీలకు ఇబ్బంది ఏముందో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించిన బీసీ బిల్లును రాష్ట్రపతి, గవర్నర్ కార్యాలయాల్లో ఉద్దేశపూర్వకంగా నిలిపివేయడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసేందుకే బీఆర్‌ఎస్‌తో కలిసి రిజర్వేషన్లు అడ్డుకుంటుందన్నారు. అగ్రవర్ణ పేదలకు కేంద్రంతో పాటు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలు ఎవరూ అడ్డుపడలేదని గుర్తుచేశారు. స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం ఉండకూడదనే కుట్రలు చేస్తున్నాయని అన్నారు. సమావేశంలో లక్ష్మయ్య, యాదయ్య ఉన్నారు.