
శత శాతమే లక్ష్యం..
నేటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
●
కందనూలు: రానున్న పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధంచేశారు. అందులో భాగంగా సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితమే డీఈఓ రమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
నిర్వహణ ఇలా..
జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 5,250, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో 800 మంది, మోడల్ స్కూళ్లలో 131మంది విద్యార్థులు పదో తరగతి అభ్యసిస్తున్నారు. రోజు ఒక సబ్జెక్టు ఉపాధ్యాయుడు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. విద్యార్థులతో ముఖ్యమైన అంశాలను చదివించడం.. వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ వహించడం వంటి చర్యలు తీసుకుంటారు. డిసెంబర్ 31వ తేదీ వరకు సాయంత్రం 4:15 నుంచి 5:15 గంటల వరకు రోజు ఒక గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. జనవరి 1నుంచి వార్షిక పరీక్షల వరకు ఉదయం, సాయంత్రం రెండు పూటలు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల ఆధారంగా లఘు పరీక్షలు నిర్వహిస్తూ.. వారిని మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. అదే విధంగా విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా చర్యలు తీసుకోనున్నారు.
డిసెంబర్ వరకు సాయంత్రం వేళ నిర్వహణ
జనవరి నుంచి రెండు పూటలు
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ