
36 పథకాల సమ్మిళితమే ‘పీఎండీడీకేవై’
యథావిధిగా ప్రజావాణి
బిజినేపల్లి: వ్యవసాయ రంగానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండేలా 11 శాఖలు అమలుచేస్తున్న 36 పథకాల సమ్మిళితమే ప్రధానమంత్రి ధన్–ధ్యాన కృషి యోజన (పీఎండీడీకేవై) పథకమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం పాలెం కేవీకే ఆధ్వర్యంలో వర్చువల్‌గా ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన పథకం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పీఎండీడీకేవై పథకం రైతులకు అనేక ప్రయోజనాలను అందిస్తుందన్నారు. పంట దిగుబడి, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నీటి పారుదలను మెరుగుపరుస్తుందన్నారు. వైవిధ్యమైన పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు రైతులకు మెరుగైన ధరలకు మద్దతు ఇస్తుందన్నారు. వాతావరణ మార్పు ప్రభావాలను తగ్గించడానికి, పంట నష్టాలను తగ్గించడానికి స్థిరమైన వ్యవసాయ పద్ధతులు ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సంవత్సరానికి మూడు పంటలు పండించే అవకాశం పుష్కలంగా ఉందన్నారు. డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ అభివృద్ధి, రైతుల ఆదాయం రెండింతలు అయ్యేందుకు ప్రధాని మోదీ కొత్త పథకం ప్రారంభించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో డీఏఓ యశ్వంత్‌రావు, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి జ్ఞానశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్: ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీ నుంచి యథావిధిగా కొనసాగించనున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటం వల్ల తాత్కాలికంగా ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నిలిచినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.