
ఏటీసీతో ఉపాధి అవకాశాలు మెరుగు
మన్ననూర్/ అచ్చంపేట రూరల్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మన్ననూర్‌లో నెలకొల్పిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌లో నైపుణ్యాలతో కూడిన శిక్షణతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం ఆయన మన్ననూర్‌లోని ఏటీసీ సెంటర్‌ను సందర్శించి ల్యాబోరేటరీలు, వర్క్‌షాప్ తదితర విభాగాలతోపాటు తరగతి గదులను పరిశీలించారు. సంస్థలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరు క్రమం తప్పకుండా తరగతులకు హాజరై శిక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. శిక్షణ పొందిన విద్యార్థుల సామర్థ్యాలను బట్టి ప్రభుత్వ, ప్రైవేటు మల్టీనేషనల్ కంపెనీలు, సంస్థలలో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అలాగే స్వయం ఉపాధి కోసం కూడా ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సంస్థ ప్రిన్సిపాల్ లక్ష్మణస్వామి ఏటీసీ సెంటర్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ట్రేడ్, యంత్ర పరికరాల గురించి కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ అచ్చంపేటలోని ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి.. విధులకు హాజరు కాని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. ఆస్పత్రిలోని రోగులు, బంధువులతో మాట్లాడి వైద్యం, చెంచు, గిరిజన ప్రాంతాల గర్భిణులకు అందించే సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రులు ప్రజలకు అత్యంత నమ్మకమైన వైద్యసేవల కేంద్రాలుగా ఉండాలన్నారు. రోగులందరికీ పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్లు శైలేంద్రకుమార్, సైదులు, మన్ననూరు గ్రామ కార్యదర్శి భీముడు, శిక్షణ అధికారులు సుధాకర్, నసీర్‌బాబ, ఖయ్యూం పాల్గొన్నారు.