
నిబంధనల గుదిబండ
సమయానికి రాకపోతే..
పత్తి కొనుగోలుకు కపస్ కిసాన్ యాప్ తెచ్చిన సీసీఐ
●
అచ్చంపేట: పత్తి రైతులకు ఏటా కొనుగోళ్ల సమయంలో తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది కపస్ కిసాన్ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా– సీసీఐ) అనే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌లో ముందుగా స్లాట్ బుకింగ్ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. పండించిన పంటను రైతులు అమ్ముకోవాలంటే వారం రోజుల ముందే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సీసీఐ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్లాట్‌లో నిర్దేశించిన సమయానికి రైతులు పత్తి కొనుగోలు కేంద్రానికి తమ పంట తీసుకురావాలి. అయితే ఇప్పటికే అధిక వర్షాల కారణంగా దిగుబడిపై రైతుల్లో గుబులు మొదలవగా.. తాజాగా తేమశాతం విషయంలో సీసీఐ నిబంధనలు గుదిబండగా మారుతాయని పెదవి విరుస్తున్నారు. ఈ నెల 20 తర్వాత కొనుగోళ్లు మొదలయ్యే అవకాశం ఉంది.
తేమ పేరుతో ఇబ్బందులు
జిల్లాలో రైతులు 2,20,582 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వ్యవసాశాఖ అంచనా ప్రకారం 33 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అయితే అధిక వర్షాలు, తెగుల వల్ల పత్తి దిగుబడిపై ఈసారి తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం క్వింటాల్ పత్తి మద్దతు ధర రూ.8,110గా నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలో ఉన్న 16 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాల్లో పత్తి తేమశాతం 8 నుంచి 12 శాతం వరకు ఉండేలా చూసుకోవాలని సీసీఐ పేర్కొంది. అయితే గతేడాది చాలా చోట్ల తేమపేరుతో ఇబ్బందులు పెట్టిన ఘటనలు లేకపోలేదు.
ఇకపై అమ్మాలంటే
స్లాట్ నమోదు తప్పనిసరి
చదువురాని వారి పరిస్థితి
ఏమిటని సందేహాలు
తేమ శాతంపైనా రైతుల్లో ఆందోళన
అధిక వర్షాలతో ఈసారి
దిగుబడులపై ప్రభావం
జిల్లాలో చాలామంది రైతులు నిరక్షరాస్యులే కావడంతో వారు యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే ఇబ్బందులే ఎదురవుతాయి. పైగా చాలామందితో స్మార్ట్ ఫోన్లు కూడా లేవు. పైగా వారం రోజుల ముందు స్లాట్ బుక్ చేసుకోవాలనే నిబంధన మరింత ఇక్కట్లకు గురిచేస్తోంది. స్లాట్ బుక్ చేసిన సమయానికి కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకురాకపోతే స్లాట్ రద్దు అవుతుంది. దీనివల్ల మరో వారం రోజులు రైతులు వేచి ఉండాల్సి వస్తోంది. సాధారంగా రైతులు తమ సమీపంలోని కొనుగోలు కేంద్రాల్లోనే పంట అమ్ముతుంటారు. ఈ స్లాట్ విధానం వల్ల దూర ప్రాంతాల్లోని కేంద్రాలకు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. దీంతో రైతులు దూరం పెరిగి రవాణా ఖర్చులు భారంగా మారుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.