
యమపాశాలు..
వ్యవసాయ పొలాల్లో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు
● ఇళ్లపై వేలాడుతున్న వైర్లతో ప్రమాదాలు
● వానాకాలంలో పొంచి ఉన్న ముప్పు
● ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోక ఇబ్బందులు
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని వ్యవసాయ పొలాలు, ఇళ్ల మధ్య విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. వానాకాలంలో విద్యుత్ తీగలతో ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల విద్యుత్ సమస్యలకు ఏళ్లుగా పరిష్కారం లభించడం లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ప్రజల్లో నెలకొంది. ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లతో ప్రాణాలు పోకముందే అధికారులు స్పందించి త్వరగా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
కర్రలే స్తంభాలు..
జిల్లాలోని పలుచోట్ల వ్యవసాయ పొలాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఏళ్లుగా విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు నోచుకోక రైతులు కర్రలనే స్తంభాలుగా ఏర్పాటుచేసుకొని విద్యుత్ సరఫరా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. తక్కువ ఎత్తులో వేలాడుతున్న కరెంట్ తీగల నడుమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సాగు పనులు చేసుకుంటున్నారు. రోడ్ల పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లకు సైతం కంచె, రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. నేలపైనే నిర్లక్ష్యంగా ఉంచిన ట్రాన్స్‌ఫార్మర్లు దారిన వెళ్లే రైతులు, పశువుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి.
పట్టని అధికారులు..
వానాకాలానికి ముందే విద్యుత్‌శాఖ సమాయత్తమై సమస్యలపై దృష్టిసారించాల్సి ఉండగా.. కొన్ని పనులకే పరిమితమవుతున్నారు. ఫలితంగా రైతులు, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కొత్తగా విద్యుత్ కనెక్షన్ కోసం డీడీలు చెల్లించిన రైతులకే స్తంభాలు, విద్యుత్ తీగలు ఏర్పాటుచేసేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ పొలాల్లో విరిగిన స్తంభాలు, ప్రమాదకరంగా వేలాడుతున్న తీగలను సరిచేయడం లేదు. ఇళ్లపై వేలాడుతున్న తీగలతో ప్రమాదం ఉందని తెలిసినా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఏళ్లుగా సమస్యలు పరిష్కారానికి నోచుకోక బాధితులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాకేంద్రంలోని శ్రీపురం రహదారి పక్కన వీధిలో నడిరోడ్డుపైనే ఉన్న విద్యుత్ స్తంభంతో స్థానికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లుగా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. నడిరోడ్డులోనే స్తంభం ఉండటంతో రాకపోకలకు అవస్థలు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు.

యమపాశాలు..

యమపాశాలు..

యమపాశాలు..