
రోగులకు ఇబ్బందులు రానివ్వొద్దు
కల్వకుర్తి టౌన్/వెల్దండ: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్యం అందించడంతో పాటు వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ రవికుమార్ అన్నారు. శనివారం కల్వకుర్తి సీహెచ్‌సీని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ లక్ష్మణ్‌తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులతో చాలా మంది ఆస్పత్రులకు వస్తున్నారని.. వారికి తగు పరీక్షలు నిర్వహించాలన్నారు. డెంగీ, మలేరియా వంటి కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా కాన్పుల కోసం వచ్చే గర్భిణులను ముందుగానే అడ్మిట్ చేసుకొని సాధారణ ప్రసవం అయ్యేలా చూడాలన్నారు. అప్పుడే పుట్టిన నవజాత శిశువులతో పాటుగా, చిన్నారులకు ఇచ్చే వ్యాక్సినేషన్ వివరాలను పక్కాగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని.. లేనిచో చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం ఆయన రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు.
● వెల్దండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవనాన్ని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. వర్షాలకు భవనం దెబ్బతినడంతో ప్రభుత్వం రూ. 40లక్షలతో మరమ్మతు చేయిస్తున్నట్లు తెలిపారు. తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న పీహెచ్‌సీని త్వరలోనే సొంత భవనంలోకి మారుస్తామన్నారు. ఆయన వెంట సీహెచ్‌సీ సూపరిటెండెంట్ శివరాం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భీమానాయక్, వైద్యులు విజయ్, శివ, యశోద, సింధు, ప్రోగ్రాం ఆఫీర్ లక్ష్మణ్‌నాయక్, పర్వతాలు, సిబ్బంది ఉన్నారు.