
అభివృద్ధి పనులు వేగిరం చేయాలి
వంగూర్: మండలంలోని కొండారెడ్డిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో అత్యంత వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కొండారెడ్డిపల్లిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. అంతకుముందు గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమావేశమై.. ఇందిరమ్మ ఇళ్లు, ఎంప్లాయిమెంట్, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, సీసీరోడ్లు, ఆర్‌అండ్‌బీ రోడ్డు, సోలార్, నాలుగు లైన్ల రహదారి, పాలశీతలీకరణ కేంద్రం, యూనియన్ బ్యాంకు, పోస్టాఫీస్, అంగన్‌వాడీ కేంద్రం భవనాలు, పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణాలు తదితర పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వారం పనుల పురోగతిపై తప్పనిసరిగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. పనుల పూర్తిపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి, పీఆర్ ఈఈ విజయ్‌కుమార్, ఎల్‌డీఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.