
పంటల లెక్క పక్కా..
జిల్లాలో కొనసాగుతున్న సాగు సర్వే
● అక్టోబర్ చివరి నాటికి
పూర్తిచేసేలా ప్రణాళికలు
● సేకరించిన వివరాలు
ఆన్‌లైన్‌లో నమోదు
● జిల్లాలో 4,64,876 ఎకరాల్లో
వివిధ పంటల సాగు
నాగర్‌కర్నూల్: జిల్లాలో వ్యవసాయ విస్తరణ అధికారులు పొలంబాట పట్టారు. ఈ ఏడాది వానాకాలంలో రైతులు సాగుచేసిన పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో సర్వేకు కొంత ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ చివరి వరకు సర్వే పూర్తిచేసేలా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. వానాకాలం సాగుకు సంబంధించి వరినాట్లు, ఇతర పంటల విత్తనాలు నాటడం పూర్తి కావడంతో సర్వే వేగవంతం చేశారు. పంటల వివరాలను పూరి్‌ాత్స్థయిలో ఏఈఓలు ప్రత్యేక యాప్‌తో పాటు డిజిటల్ క్రాప్ సర్వే యాప్‌లో నమోదు చేస్తున్నారు.
క్లస్టర్ల వారీగా..
జిల్లాలో ప్రస్తుతం క్లస్టర్ల వారీగా సర్వే కొనసాగుతోంది. మొత్తం 142 క్లస్టర్లలో అక్టోబర్ చివరి వరకు సర్వేను కొనసాగించి.. నవంబర్ 1న అన్ని గ్రామపంచాయతీల్లో రైతుల పేర్లు, వారు సాగుచేసిన పంటల వివరాలను ప్రదర్శిస్తారు. అనంతరం రైతుల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి.. నవంబర్ మొదటి వారంలో తుది జాబితాను సిద్ధంచేసి ప్రభుత్వానికి అందించనున్నారు. ఈ సర్వే ద్వారా రైతులు ఏఏ పంటలు వేశారనే కచ్చితమైన సమాచారం తెలియడంతో పాటు పంటల దిగుబడి మేరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.
20,153 ఎకరాల్లో మాత్రమే..
జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం 4,64,876 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగుచేశారు. ఇందులో ప్రధానంగా పత్తి 2,67,079 ఎకరాల్లో, వరి 1,36,406, కంది 3,564, మొక్కజొన్న 52,274, జొన్న 4,272, మినుములు 1,281, వేరుశనగ 157, ఆముదం 31, మిగతా పంటలు మరికొన్ని ఎకరాల్లో సాగుచేశారు. అయితే ఇప్పటివరకు 20,153 ఎకరాల్లో మాత్రమే పంట సర్వే పూర్తయింది. ఇంకా 4,44,723 ఎకరాల్లో పంటలను సర్వే చేయాల్సి ఉంది.