
ఆదాయ శాఖకు..అద్దె భవనాలే దిక్కా?
ఇబ్బందులు లేకుండా చూస్తాం..
నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నూతన భవన ప్రతిపాదనలపై నాకు ఎలాంటి సమాచారం లేదు. అయితే కార్యాలయాలకు వచ్చే క్రయ విక్రయదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం.
– ఫణీందర్, జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు అధికారి
మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు కరువయ్యాయి. ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూర్చే ఈ కార్యాలయాలు ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఎంత ఆదాయం ఆర్జించినా.. కార్యాలయానికి సొంత భవనాలు సమకూర్చుకోలేని దుస్థితిలో ఈ శాఖ ఉంది. సరైన వసతులు లేకపోవడంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బందితోపాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే క్రయవిక్రయదారులు సైతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల మాట అలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వ్యవహారాలు పర్యవేక్షించే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం కూడా అద్దె భవనంలోనే కొనసాగుతుండటం మరో విశేషం. ఆడిట్, చిట్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సైతం ఇందులోనే ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ఉద్యోగులకు సైతం వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రెండు చోట్లే పక్కా భవనాలు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. ఇందులో కేవలం కల్వకుర్తి, ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రమే పక్కా భవనాలు కలిగి ఉన్నాయి. మిగతా పది కార్యాలయాలు అద్దె భవనాల నుంచే రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నాయి. వీటికి గాను రూ.వేలల్లో ప్రతినెలా అద్దె చెల్లిస్తున్నారు. ఏళ్లతరబడిగా ఇలా చెల్లిస్తున్న అద్దెలతోనే పక్కా భవనాలు నిర్మించవచ్చని ప్రజలు విమర్శిస్తున్నారు. అయితే మక్తల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇటీవల నూతన భవనంలోకి మార్చినా.. అద్దె నిర్ణయించలేదని అధికారులు చెబుతున్నారు.
వసతులు లేక అవస్థలు..
జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా.. ఎక్కడా సరైన వసతులు లేవు. ఒక్కో కార్యాలయానికి సగటున ప్రతిరోజు వందమంది వరకు వస్తుండటంతో మూత్రశాలలు, మరుగుదొడ్లు, పార్కింగ్, తాగునీరు వంటివి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చిన్నగా ఉండటంతో పార్కింగ్ లేక అవస్థలు పడుతున్నారు. అచ్చంపేటలో చిన్నపాటి రోడ్డులో ఉండటంతో వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది.
ప్రైవేట్ ఇళ్లలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
ఆదాయం ఎక్కువ.. వసతులు తక్కువ
వాహనాల పార్కింగ్‌కూ స్థలం కరువు
అవస్థలు పడుతున్న క్రయవిక్రయదారులు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి

ఆదాయ శాఖకు..అద్దె భవనాలే దిక్కా?

ఆదాయ శాఖకు..అద్దె భవనాలే దిక్కా?

ఆదాయ శాఖకు..అద్దె భవనాలే దిక్కా?