
‘ఆదివాసీల ఐక్యతను చాటుదాం’
నాగర్‌కర్నూల్: గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు, జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్‌లో ఇన్‌చార్జీ పీఓ ఐటీడీఏ రోహిత్ గోపిడి, డీఆర్డీఏ చిన్న ఓబులేష్, సంబంధిత అధికారులు, చెంచు నాయకులతో కలిసి కలెక్టర్ బాదావత్ సంతోష్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అచ్చంపేట పట్టణ కేంద్రంలో నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభకు చెంచులు, ప్రజలు, ఉద్యోగులు కలిపి సుమారు 1000 మందితో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులను సన్మానించడంతో పాటు ఆదివాసీ సంఘాల సమన్వయంతో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో చెంచు సంఘాల నాయకులు గురువయ్య, శ్రీనివాసులు, పెద్దిరాజు, నాగరాజు, పద్మ, రాములు, వెంకటస్వామి, లింగస్వామి, హనుమయ్య, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా రోడ్లు, నీటిపారుదల, విద్యుత్, ఆరోగ్యం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజ్, సోలార్ విద్యుదీకరణ, మిషన్ భగీరథ వంటి రంగాల్లో పనుల వారీగా పురోగతి వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి భూపాల్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ దేశనాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల కృత్రిమ కొరత సృష్టించొద్దు
బిజినేపల్లి: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా, ఇతర ఎరువులు ఉన్నాయని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్టే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు. మండల వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని, ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘంలోని ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. పీహెచ్‌సీకి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఏఓ కమల్‌కుమార్, పీహెచ్‌సీ వైద్యాధికారి డా.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.