
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ
మహబూబ్‌నగర్ క్రైం: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఓ ఏఈఈ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ ఇరిగేషన్ సబ్ డివిజన్–1లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ)గా పనిచేస్తున్న మహ్మద్ ఫయాజ్.. ఓ వ్యక్తి తన 150 గజాల ప్లాట్‌కు సంబంధించి ఎల్‌ఆర్‌ఎస్, ఎన్‌ఓసీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు రూ.5 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు రూ.3 వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. బుధవారం ఉదయం జిల్లాకేంద్రంలోని వన్‌టౌన్ చౌరస్తాలో ఉన్న ఓ బేకరి దగ్గరకు రావాలని ఏఈఈ ఫోన్ చేయడంతో బాధితుడు అక్కడికి వెళ్లి తన దగ్గర ఉన్న రూ.3 వేల నగదు ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకున్న ఏఈఈ జేబులో పెట్టుకున్న కాసేపటికే అక్కడికి వచ్చిన ఏసీబీ బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం ఏఈఈని నేరుగా కార్యాలయానికి తీసుకెళ్లి.. ఆయన చాంబర్‌తో పాటు వన్‌టౌన్ ఏరియాలో ఆయన అద్దె ఇంట్లో సైతం సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి ఆస్తులు, నగదు లభ్యం కాలేదని డీఎస్పీ వెల్లడించారు. మహ్మద్ ఫయాజ్‌ను గురువారం ఏసీబీ కోర్టు నాంపల్లిలో హాజరుపరుస్తామని తెలిపారు.
రూ.3వేలు లంచం తీసుకుంటూ చిక్కిన వైనం