
జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం
నాగర్‌కర్నూల్: అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకుసాగాలని దిశ కమిటీ చైర్మన్, ఎంపీ డా.మల్లు రవి అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యేలు డా.రాజేశ్‌రెడ్డి, డా.వంశీకృష్ణ, డీఎఫ్‌ఓ రోహిత్ గోపిడి, అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయంతో కలిసి నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశంలో జాతీయ రహదారులు, ఎస్సీ కార్పొరేషన్, వివిధ సంక్షేమ శాఖలు, విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, శిశు సంక్షేమం, పౌర సరఫరాలు, పరిశ్రమలు తదితర శాఖల పురోగతిపై దిశ కమిటీ చైర్మన్ మల్లు రవి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు అర్హులందరికీ అందించాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తనకు లేదా స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో కేటాయించిన లక్ష్యం మేరకు అన్ని రంగాలకు విరివిగా రుణాలు అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయం, చిరు వ్యాపారాలకు రుణాలు అందించి పేద ప్రజలకు ఆర్థికంగా అండగా నిలవాలన్నారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో పురోగతి సాధించినప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. ఇందుకోసం అధికారులు ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. మద్దిమడుగు – మాచారం బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. 2017 నుంచి 2025 వరకు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించిన రుణాల గ్రౌండింగ్‌ను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, జిల్లా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో మెడికల్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీ మల్లు రవి అన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాధుల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉపాధి అవకాశాలు పెంచడంతో ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ఔత్సాహికులు పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా చేపట్టాలని, నీటిపారుదల కాల్వల ఆధునికీకరణ, పూడికతీత పనులకు ప్రాధాన్యమివ్వాలని ఆయన సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ చిన్న ఓబులేషు, దిశ కమిటీ సభ్యులు వంకేశ్వరం మణెమ్మ, ఎం.భగవంతురెడ్డి, వి.చిన్నయ్య, మాదవత్ మోతీలాల్ తదితరులు ఉన్నారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి
ప్రజాప్రతినిధులు, అధికారులుసమన్వయంతో ముందుకుసాగాలి
దిశ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి

జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం