
సమస్యల పరిష్కారానికి చర్యలు
నాగర్‌కర్నూల్: మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పుర కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం 17వ వార్డులో ఆయన పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. మొదటగా కాలనీలోకి వచ్చే రోడ్డుకు అడ్డుగా నిర్మించిన గోడతో పాటు అసంపూర్తిగా నిలిచిన మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు. వార్డులో కొత్తగా నివాసగృహాలు నిర్మించుకున్న వారికి ఇంటి నంబర్లు కేటాయించడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.
నేడు డయల్
యువర్ డీఎం
అచ్చంపేట రూరల్: అచ్చంపేట ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు గాను బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం మురళీ దుర్గాప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 94408 18849 నంబర్‌ను సంప్రదించి సమస్యలను తెలియజేయడంతో పాటు సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు.
గుడిబండ వద్ద ‘డ్రై పోర్ట్’
అడ్డాకుల: మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని గుడిబండ సమీపంలో డ్రై పోర్ట్(రోడ్డు మార్గం ద్వారా ఓడరేవుకు అనుసంధానించబడిన ఇన్‌ల్యాండ్ టెర్మినల్) నిర్మాణానికి అధికారులతో కలిసి ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. గుడిబండ శివారులోని సర్వే నంబర్ 118లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ, లాజిస్టిక్స్ డైరెక్టర్ అపర్ణ, ఇతర అధికారులు స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. డ్రై పోర్ట్ ఏర్పాటు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అంచనా వేశారు. ఇటీవల దేవరకద్ర వద్ద ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయగా.. తాజాగా గుడిబండ వద్ద డ్రై పోర్ట్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్, కర్నూలు, రాయచూర్ ప్రాంతాలకు సులభమైన కనెక్టివిటీ ఉండటం కూడా డ్రై పోర్ట్ నిర్మాణానికి కలిసి వస్తుందని చెప్పారు.
చేనేత ఉత్పత్తులసంఘానికి అవార్డు
అమరచింత: అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘాన్ని ఉత్తమ సంఘంగా ఎంపిక చేసి జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చేతుల మీదుగా కంపెనీ సీఈఓ చంద్రశేఖర్‌కు అవార్డును అందించారు. నాబార్డు ఏర్పడి నేటికి 44 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం నాబార్డ్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘం సీఈఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆరేళ్లుగా సంఘాన్ని కొనసాగిస్తూ చేనేత కార్మికులే కంపెనీ షేర్ హోల్డర్స్‌గా నియమించడంతో పాటు వచ్చిన లాభాల్లో అందరికీ సమాన వాటా ఇస్తున్నామని తెలిపారు. తమ కృషిని గుర్తించి నాబార్డు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంఘంగా ఎంపిక చేసి అవార్డు ఇవ్వడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్, టీజీ క్యాబ్ చైర్మన్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల దరఖాస్తులు
పెండింగ్‌లో పెట్టొద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టుకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని విద్యుత్ కార్పొరేట్ కమర్షియల్ డైరెక్టర్ చక్రపాణి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని విద్యుత్ భవన్‌లోని మీటింగ్ హాల్‌లో విద్యుత్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు చెందిన కనెక్షన్లను త్వరగా మంజూరు చేయాలని, వాటికి సంబంధించిన విద్యుత్ సా మగ్రిని వెంటనే అందజేయాలని సూచించారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు