
ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
పెంట్లవెల్లి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 18న కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. మంగళవారం పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌లో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గానికి వస్తున్నారన్నారు. జటప్రోల్‌లో రూ. 150కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేసిన అనంతరం సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం హెలీపా్‌య్డ్, సభా స్థలాన్ని మంత్రి పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ భన్సీలాల్ పాల్గొన్నారు. కాగా, జటప్రోల్ సమీపంలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి కేటాయించిన 16.06 ఎకరాల భూమి గోప్లాపూర్ శివారుకు చెందినదని.. కొత్తగా నిర్మించే పాఠశాలకు తమ గ్రామం పేరు పెట్టాలని కోరుతూ గ్రామస్తులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు