
మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
తిమ్మాజిపేట: ప్రస్తుతం ఎంతో మంది మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని.. వారి స్ఫూర్తితో మహిళలందరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని హ్యూమన్ ట్రాఫికింగ్, షీ టీం జిల్లా ఇన్‌చార్జీలు సీఐ శంకర్, విజయలక్ష్మి అన్నారు. తిమ్మాజిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం షీ టీం ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ఇంటా, బయట నేరాలు పెరిగిపోతున్నాయని.. విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, ఇతర ప్రదేశాల్లో వేధింపులకు గురయ్యే వారు ధైర్యంగా డయల్ 100 లేదా 87126 57676 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని చదువులో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు హరిప్రసాద్‌రెడ్డి, రమాదేవి, ఎంఈఓ సత్యనారాయణశెట్టి, శ్రీలత, శేఖర్‌గౌడ్, వెంకటయ్య పాల్గొన్నారు.