
కలెక్టరేట్ ప్రజావాణికి 32 అర్జీలు
నాగర్‌కర్నూల్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై 32 అర్జీలు అందాయి. ప్రజల సమస్యలను కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించినట్లు ఆయన తెలిపారు.
ఫిర్యాదులు
త్వరగా పరిష్కరించండి
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశించారు. సోమ వారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వ హించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పా ల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మూడు ఫిర్యాదులు భూ తగాదాలపై, ఒకటి తగున్యాయం కోసం, మరొకటి భార్యాభర్తల గొడవపై ఫిర్యాదు అందినట్లు తెలిపారు.
స్థానిక ఎన్నికలకు
కాంగ్రెస్ కసరత్తు
స్టేషన్ మహబూబ్‌నగర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో సత్తా చాటడానికి పార్టీ సన్నద్ధమవుతోంది. తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ ఆమోదం మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ సోమవారం ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జ్‌గా పార్టీ సీనియర్ నాయకుడు, పీఏసీ సభ్యుడు జె.కుసుమకుమార్ నియామకమరు. ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీల నిర్మాణం చేపట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ కీలకపాత్ర పోషించనున్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు..
రాష్ట్రంలోని వివిధ ఉమ్మడి జిల్లాలకు మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు ఇన్‌చార్జ్‌లుగా నియామకం అయ్యారు. ఇందులో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి ఖమ్మం, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్ నల్లగొండ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ కె.శివసేనారెడ్డి రంగారెడ్డి జిల్లాలకు ఇన్‌చార్జీగా నియమితులయ్యారు.
ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించాలి
అచ్చంపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేయడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెండింగ్ పనులను పూర్తిచేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో పూర్వపు ప్రాథమిక విద్య ప్రవేశపెట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, లలితాబాయి, రాములు, బాబురావు, హన్మ, రామకృష్ణ, రామచంద్రు, బీచ్య, చంద్రకళ, రేణుక, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పీయూ మాల్‌ప్రాక్టీస్ కమిటీ భేటీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్– 2, 4, 6, ఇంటిగ్రేటెడ్ బీఈడీ 2, 4, 6 పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థులు మంగళవారం పీయూ మాల్‌ప్రాక్టిస్ కమిటీ ఎదుట హాజరుకావాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుక్ అయిన విద్యార్థుల వివరాలను ప్రిన్సిపాల్స్ మెయిల్‌కు పంపించామని, వారు తప్పకుండా ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో, మాల్ ప్రాక్టిస్ చేసినందుకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని సూచించారు.

కలెక్టరేట్ ప్రజావాణికి 32 అర్జీలు