
పచ్చదనం పరిచేలా..
అచ్చంపేట రూరల్: పట్టణ ప్రాంతాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఉమెన్ ఫర్ ట్రీస్ (మహిళలతో మొక్కలు)’ కార్యక్రమంతో పచ్చదనం పెంపే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మొదటి విడతగా ఓ ప్రాంతాన్ని ఎంపికచేసి నాటిన మొక్కలను రెండేళ్ల వరకు సంరక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. గత మేలో ఈ కార్యక్రమంపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించగా.. ఎక్కడ మొక్కలు నాటాలో గుర్తించే ప్రక్రియను ఇటీవల ప్రారంభించారు.
10 మంది చొప్పున..
జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీలు ఉండగా.. మహిళా సంఘాల సభ్యులతో మొక్కలు నాటించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా మున్సిపాలిటీల్లోని ప్రతి మహిళా సంఘంలో 10 మంది సభ్యులను ఎంపిక చేశారు. వీరు 200 చొప్పున మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కొక్క సంఘం 2,000 చొప్పున మొక్కలు నాటి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. స్థలాలు లేని చోట కొంత వెసులుబాటు ఇచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రెండేళ్ల వరకు మొక్కల సంరక్షణ బాధ్యతలు ఎంపికై న వారే చూస్తారు. ఈ ప్రక్రియ పర్యవేక్షణ నిమిత్తం ఒక్కో పట్టణానికి నోడల్ అధికారిని సైతం నియమించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సదరు బాధ్యతల నిర్వహణ కోసం ఒకరికి రూ. 5వేల వరకు ప్రతి నెలా చెల్లిస్తారు. కార్యక్రమం విజయవంతమైతే వచ్చే ఏడాది మరిన్ని మొక్కలు నాటే అవకాశం ఉంటుంది.
నాటనున్న మొక్కలు..
పండ్లు, నీడనిచ్చే వాటితో పాటు ప్రజోపయోగ మొక్కలను అధికారులు ఎంపిక చేశారు. అందులో రావి, వేప, బయో డీజిల్, ఉత్తరేణి తదితర రకాలు ఉన్నాయి. పురపాలికల్లోని ప్రధాన చెరువుల వద్ద మొక్కలు నాటాలని నిర్ణయించారు. అలాగే రద్దీ ప్రదేశాలు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాల స్థలాలు, తదితర చోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించారు.
మహిళా సంఘాలకుమొక్కల సంరక్షణ బాధ్యత
సరికొత్త కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం
ఒక్కో సంఘం 2,000 చొప్పున
మొక్కలు నాటేలా ప్రణాళిక
మున్సిపాలిటీల్లో ఆహ్లాదకర వాతావరణం దిశగా అడుగులు

పచ్చదనం పరిచేలా..