
ఇంటర్ పాఠ్యపుస్తకాలు అందేదెన్నడో?
కందనూలు: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ అభ్యసిస్తున్న విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు నేటికీ అందలేదు. ఇంటర్ తరగతులు ప్రారంభమై నెలరోజులకు పైగా అయినప్పటికీ పాఠ్యపుస్తకాలు అందించకపోవడం విద్యాభ్యాసంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అధ్యాపకులు ఏ పాఠం చెబుతున్నారో.. తాము ఏం చదవాలో.. ఏం రాయాలో అర్థంకాక విద్యార్థినులు అయోమయానికి గురవుతున్నారు. కొందరు పాత పుస్తకాలతో నెట్టుకొస్తున్నారు. అయితే కొత్త కోర్సుల్లో చేరిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బాలికా విద్య బలోపేతం, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయకుండా నిరోధించేందుకు ఏర్పాటైన కస్తూర్బా, ఆదర్శ విద్యాలయాలకు పాఠ్యపుస్తకాలు అందకపోవడం గమనార్హం.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో 20 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉండగా.. గతేడాది 11, ఈ ఏడాది 9 కేజీబీవీల్లో ఇంటర్ విద్య ప్రవేశపెట్టారు. ఈ విద్యా సంవత్సరం 1,926 మంది విద్యార్థినులకు ప్రవేశాలు కల్పించారు. వీరిలో ప్రథమ సంవత్సరం 1,200 మంది, రెండో సంవత్సరం 796 మంది విద్యార్థినులు ఉన్నారు. అదే విధంగా కోడేరు, వెల్దండలోని ఆదర్శ విద్యాలయాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 346 మంది విద్యనభ్యసిస్తున్నారు. నాగర్‌కర్నూల్, లింగాల, కొల్లాపూర్, వెల్దండ, చారకొండ, పెంట్లవెల్లి, అమ్రాబాద్ కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు ఉండగా.. బిజినేపల్లి, తెలకపల్లి, కల్వకుర్తి, బల్మూర్, తాడూర్, తిమ్మాజిపేట, ఉప్పునుంతల, వంగూర్ కేజీబీవీల్లో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు ఉన్నాయి. అచ్చంపేట, కోడేరు, పెద్దకొత్తపల్లి, ఊర్కొండ, పదరలో ఏఐ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, కంప్యూటర్ సైన్స్, అకౌంటింగ్ కోర్సులు కొనసాగుతున్నాయి. ప్రతి కోర్సులో 40 మంది విద్యార్థినులు చదువుకునే అవకాశం ఉంది. ఆయా కోర్సుల్లో చేరిన వారికి ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉండగా.. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక్క కొత్త పాఠ్యపుస్తకం కూడా అందలేదు. దీంతో కొన్ని విద్యాలయాల్లో పాత పుస్తకాలతో బోధన కొనసాగిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన ఏఐ, ఇతర కోర్సుల పాఠ్యపుస్తకాలు లేకుండా విద్యార్థినులకు బోధన ఎలా సాగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
కేజీబీవీ, ఆదర్శ విద్యాలయాల్లో అరకొర అభ్యాసనం
ఇంటర్ విద్యార్థినులకు పుస్తకాల పంపిణీలో జాప్యం
పాత పుస్తకాలతోనే నెట్టుకొస్తున్న వైనం
కొత్త కోర్సుల్లో చేరిన వారి పరిస్థితి అగమ్యగోచరం

ఇంటర్ పాఠ్యపుస్తకాలు అందేదెన్నడో?