
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
నాగర్‌కర్నూల్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసం నుంచి ఉదయం 8గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి.. 10:30 గంటలకు మన్ననూర్ మృగవాణి అతిథిగృహానికి చేరుకొని స్థానిక రెవెన్యూ అంశాలపై అధికారులతో చర్చిస్తారన్నారు. అనంతరం అమ్రాబాద్ బీటీరోడ్డు నిర్మాణానికి, గిరిజన భవనం ప్రహరీ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం ఆదివాసీ చెంచులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారన్నారు. మంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జాప్యం లేకుండా విద్యుత్ కనెక్షన్లు
నాగర్‌కర్నూల్ క్రైం: కొల్లాపూర్ నియోజకవర్గంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఈ సీహెచ్ పౌల్‌రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల కోసం డీడీలు చెల్లించిన రైతులకు మెటీరియల్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందన్నారు. సీనియార్టీ ప్రకారం రైతులకు మెటీరియల్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీ వరకు 200 మంది రైతులకు మంజూరైన ట్రాన్స్‌ఫార్మర్లు బిగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని సబ్‌స్టేషన్లలో ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో ఉన్నాయని.. 11కేవీ పనులు పూర్తయిన వెంటనే వాటిని బిగిస్తామని తెలిపారు.
మైసమ్మ జాతరలోతగ్గిన భక్తుల రద్దీ
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం తొలి ఏకాదశి, మొహర్రం పండుగ ఉండటంతో భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు. దీంతో జాతర మైదానం వెలవెలబోయింది. సుమారు 3వేల మంది భక్తులు మైసమ్మ దేవతను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
కోయిల్‌సాగర్‌లో 22.6 అడుగుల నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం ఆదివారం సాయంత్రం వరకు 22.6 అడుగులకు చేరింది. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా జూరాల నుంచి ఒక పంపును రన్ చేసి నీటిని విడుదల కొనసాగిస్తున్నారు. గత నెల రోజులుగా ప్రాజెక్టులోకి వస్తున్న నీటితో రోజుకు కొంత మేర నీటిమట్టం పెరుగుతోంది. జూరాల నుంచి నీరు రాక ముందు 11 అడుగులు ఉండగా.. 11.6 అడుగులు పెరిగి 22.6 అడుగులకు చేరింది. అయితే పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా.. మరో 4 అడుగుల నీరు రావాల్సి ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి గేట్ల లెవల్ వరకు 32.6 అడుగులు ఉండగా మరో 10 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది.
బకాయిలు
విడుదల చేయాలి
కందనూలు: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు తారాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ కళాశాలల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

నేడు మంత్రి పొంగులేటి పర్యటన