
జంతువుల పెంపకంలో జాగ్రత్తలు తప్పనిసరి
నాగర్‌కర్నూల్: పెంపుడు జంతువులతో ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున.. వాటి పెంపకంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. ఆదివారం ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో పెంపుడు జంతువులకు రేబిస్ వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో చాలా మందికి పెంపుడు జంతువులపై అమితమైన ప్రేమ ఉంటుందన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యుల తరహాలోనే ప్రేమాభిమానాలతో పెంచుకుంటారని.. పెంపుడు జంతువులకు చిన్నపాటి హాని జరిగినా విలవిల్లాడిపోతారన్నారు. అయితే జంతువుల పెంపకంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. జంతువులు, పక్షుల నుంచి జూనోసిస్ వ్యాధులైన రేబిస్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ వంటివి మనుషులకు సంక్రమిస్తాయన్నారు. పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండటం, పరిశుభ్రత పాటించడం, టీకాలు వేయించడం ద్వారా జూనోసిస్ వ్యాధులను నివారించవచ్చని అన్నారు. ప్రజారోగ్య సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు.జూనోసిస్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాంటీ రేబిస్ టీకాను కోర్సు ప్రకారం కుక్కలకు వేయించాలని కలెక్టర్ సూచించారు. కాగా, రేబిస్ వ్యాధి సోకకుండా ముందుజాగ్రత్తగా పెంపుడు జంతువుల యజమానులతో పాటు పశువైద్యులు, సిబ్బందికి టీకాలు వేశారు. అనంతరం అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి బి.జ్ఞాన శేఖర్, వైద్యారోగ్యశాఖ ఇమ్యునైజేషన్ అధికారి రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాణాంతక వ్యాధుల నివారణకు
టీకాలు వేయించాలి
కలెక్టర్ బదావత్ సంతోష్