
అడిషనల్ ఎస్పీ బదిలీ
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్‌ను బదిలీ చేస్తూ తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్త సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021 డిసెంబర్‌లో అడిషనల్ ఎస్పీగా రామేశ్వర్ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయనకు ప్రస్తుతం రాచకొండ క్రైం అదనపు డీసీపీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
లేబర్ కోడ్‌లతో
కార్మికులకు అన్యాయం
నాగర్‌కర్నూల్ రూరల్: కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పొదిల రామయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి గీత అన్నారు. లేబర్ కోడ్స్ ఆధారంగా కార్మికుల పనివేళలను 10గంటలకు పెంచడాన్ని నిరసిస్తూ సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే నాలుగు లేబర్ కోడ్‌లు అమలు చేస్తోందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8గంటల పనివేళలను రద్దుచేసి.. 10గంటలకు పెంచడం కార్మికులకు తీవ్ర అన్యాయం చేయడమేనని దుయ్యబట్టారు. కొత్త చట్టాలను రద్దుచేసే వరకు కార్మికులు సమష్టిగా పోరాడాల్సిన అవసరముందన్నారు. ఈ నెల 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు అంతటి కాశన్న, మధు, బ్రహ్మం, కృష్ణయ్య, వెంకటస్వామి, బాలస్వామి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
రామన్‌పాడుకు
కొనసాగుతున్న ఇన్‌ప్లో
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 1,021 అడుగులకు గాను సోమవారం నాటికి 1,018 అడుగుల నీటి నిల్వ ఉంది. జూరాల ఎడమ, కుడి కాల్వ ద్వారా 550 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వార 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎన్‌టీఆర్ కాలువ ద్వారా 520 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువ ద్వార 45 క్యూసెక్కులు, వివిధ లిఫ్టుల ద్వారా 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు.