
ఆదివాసీ చెంచుల అభ్యున్నతే లక్ష్యం
మన్ననూర్: ఆదివాసీ చెంచుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లోని గిరిజన భవన్‌లో ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో కలిసి ఆయన ఆదివాసీ చెంచులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అంతకు ముందు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఘనస్వాగతం పలికారు. మృగవాణి రెస్టారెంట్ వద్ద కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాండ్ వైభవ్ రఘునాథ్, ఇతర జిల్లా అధికారులు మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. నాడు, నేడు ఆదివాసీ చెంచులను అక్కున్న చేరుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఎంతో మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి సొంతింటి కలను సాకారం చేశామని.. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తీసుకుంటుందని అన్నారు. అచ్చంపేట ప్రాంతంలోని చెంచులకు ప్రస్తుతం 836 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో ఉన్న 5 జిల్లాల్లోని చెంచులతో పాటు రాష్ట్రంలోని ఐటీడీఏల పరిధిలో విడతల వారీగా 13,266 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇంటి నిర్మాణ బిల్లులు రూ. 5లక్షలతో పాటు అదనంగా మరో రూ.లక్ష అందిస్తామన్నారు.
● ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న ఆదివాసీ చెంచుల సొంతింటి కలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నెరవేరుస్తున్నారని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో మొదటి విడతగా 3,600 ఇళ్లు మంజూరయ్యాయని.. అర్హులైన ప్రతి చెంచు కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. పూర్తిగా వెనకబడిన ఈ ప్రాంతానికి అదనంగా మరో 1,500 ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
● ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు పండుగ వాతావరణం తీసుకొచ్చిందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 11,622 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, అచ్చంపేట నగర పంచాయతీ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రజిత, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, ఐటీడీఏ పీఓ రోహిత్‌రెడ్డి, ఆర్డీఓ మాధవి, ఐటీడీఏ ఏఓ జాఫర్ హుస్సేన్, డీఈలు వెంకటేశ్వర సింగ్, హేమలత, నాయకులు హరినారాయణ, రహీం, రవి, శ్రీనివాసులు, మేరాజ్, వెంకటరమణ, రేణయ్య, మల్లేష్, మల్లికార్జున్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, హన్మంత్‌రెడ్డి, రాజారాం, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వం హామీలకే పరిమితం: మంత్రి జూపల్లి
గత ప్రభుత్వం హామీలకే పరిమితమైంది తప్ప ఆచరణలో ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. మాయ మాటలతో కాలయాపన చేసి రూ. 8లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రజలపై పెట్టిందని ఆరోపించారు. గత పాలకులు చేసిన అప్పును కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తూనే.. ఏడాదిన్నర కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. పేదరిక నిర్మూలన కోసం చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నారు. ప్రభుత్వం ఆదివాసీ చెంచులకు అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నాడు, నేడు అక్కున్న చేర్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే..
ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత మాదే
రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఆదివాసీ చెంచుల అభ్యున్నతే లక్ష్యం