
సామాన్యులే టారె్గట్!
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ఫైనాన్స్ చిట్‌ఫండ్ డిపాజిట్లు, చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సామాన్యులే లక్ష్యంగా అధిక వడ్డీల ఆశ చూపుతూ నిలువునా ముంచుతున్నారు. ఏళ్ల తరబడి కష్టించి కూడబెట్టిన సొమ్మును ఫైనాన్స్ నిర్వాహకులపై నమ్మకంతో పెట్టుబడులుగా పెట్టే బాధితులు చివరకు ఉన్నదంతా కోల్పో యి నిండా మోసపోతున్నారు. జిల్లాకేంద్ర ంలో సంచలనం రేపిన సాయిరాం ఫైనాన్స్ ఉదంతం ఇంకా కొలిక్కి రావడం లేదు. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల పరిధిలో 1,647 మంది నుంచి వివిధ రూపాల్లో డిపాజిట్లు సేకరించిన ఫైనాన్స్ నిర్వాహకులు.. డబ్బులు తిరిగి ఇవ్వకుండా చేతులెత్తేయడంతో బాధితులు నిత్యం పోలీస్‌స్టేషన్, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఫైనాన్స్ మాటున ‘రియల్’ మాఫియా..
జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు, భూములు కొని వెంచర్లు వేసేందుకు పెద్దఎత్తున డబ్బులు అవసరం కావడంతో.. కొందరు ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకుల అవతారం ఎత్తారు. ప్రజల నుంచి సేకరించిన డబ్బును రియల్ ఎస్టేట్ వ్యాపారాలకోసం మళ్లించారు. అందివచ్చిన లాభాలను సొంత అవసరాలకు వినియోగించడంతో పాటు విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. అయితే రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ ప్రభావం తగ్గుముఖం పడుతోందని.. పెట్టుబడులంతా రియల్ వ్యాపారాల్లో ఉన్నాయని.. తామేమీ చేయలేమని బుకాయిస్తూ చేతులెత్తేయడం పరిపాటిగా మారింది.
పర్యవేక్షణ ఏది..
ఫైనాన్స్ కంపెనీల నిర్వాహకులు, అనధికార వడ్డీ వ్యాపారులు విచ్చలవిడిగా దందా కొనసాగిస్తున్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువైంది. జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడే కేసులు నమోదు చేసి.. చర్యలు తీసుకుంటే దందాకు అడ్డుకట్ట పడటంతో పాటు డబ్బుల చెల్లింపునకు అవకాశం ఉంటుంది. కానీ పదేపదే ఫిర్యాదులు అందితే కానీ కేసులు నమోదు చేయడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. అడపాదడపా కేసులు నమోదు చేసినా.. విచారణకు ఏళ్ల పాటు సమయం పడుతోంది. ఇదే అదనుగా అధికారులను మచ్చిక చేసుకుంటూ నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చిట్‌ఫండ్స్, చిట్టీల పేరుతో మోసాలు జిల్లాలో అడ్డగోలు దందా
అధిక వడ్డీ ఆశతో మోసపోతున్న బాధితులు
ఫైనాన్స్ కంపెనీ పేరుతో రూ. 150కోట్లు సేకరించి చేతులెత్తేసిన వైనం
విచ్చలవిడిగా డిపాజిట్లు..
జిల్లాకేంద్రంలో ఫైనాన్స్ కంపెనీ నిర్వహణ పేరుతో వివిధ వర్గాల నుంచి రూ. 150కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని వ్యాపార, ఉద్యోగ వర్గాలతో పాటు మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని విచ్చలవిడిగా డిపాజిట్లను సేకరించారు. ఇందుకు అధిక వడ్డీ రేట్ల ఆశ చూపారు. కొన్నాళ్లకు సేకరించిన డిపాజిట్లకు వడ్డీ ఇవ్వకపోవడం.. గడువు తీరినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కొందరు తమ పిల్లల చదువు, మరికొందరు తమ కూతుళ్ల పెళ్లి, భవిష్యత్‌లో అవసరాలకు పనికొస్తాయని ఇంకొందరు పెట్టుబడులు పెట్టారు. చివరకు సదరు ఫైనాన్స్ నిర్వాహకులు చేతులెత్తయడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
విచారణచేపడుతున్నాం..
జిల్లాలో చిట్‌ఫండ్, చిట్టీల పేరుతో డబ్బులు సేకరించి మోసం చేసిన కేసులో బాధితుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 1,500 మందికి పైగా బాధితులు ఉన్నట్టు గుర్తించాం. దీనిపై కేసు నమోదు చేసి సమగ్రంగా విచారణ చేపడుతున్నాం.
– శ్రీనివాస్, డీఎస్పీ, నాగర్‌కర్నూల్