రోడ్డెక్కిన అన్నదాతలు
పెంట్లవెల్లి: మండలంలోని జటప్రోలు కొనుగోలు కేంద్రం ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై మంగళవారం ఉదయం రైతన్నలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. పండించిన వరి ధాన్యాన్ని 20 రోజులుగా కేంద్రంలోనే ఉంచినా మహిళా సమైఖ్య సభ్యులు కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని.. తేమశాతం సరిగా లేదంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకేపీ అధికారులు రైస్‌మిల్లర్లతో చేతులు కలిపి ధాన్యం కొనుగోలు చేయడం లేదని మాజీ సర్పంచ్ ఆరోపించారు. సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిందని.. మళ్లీ ఎండబెట్టాలని సూచిస్తున్నారన్నారు. రాస్తారోకోతో ప్రధాన రహదారిపై గంటన్నర పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రామన్‌గౌడ్, మహిళా సమైఖ్య ఏపీఎం గౌసుద్దీన్ అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడి ఒప్పించి ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎస్‌కే ఖాజా, ఈశ్వర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, ఈశ్వరయ్య, నర్సింహ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


