వేసవి శిబిరాలతో విజ్ఞానం.. వినోదం
కల్వకుర్తి టౌన్: విద్యార్థులు వేసవి సెలవుల్లో విజ్ఞానంతోపాటు వినోదాన్ని పొందేలా ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేశామని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని కేజీబీవీలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజల్వన చేసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతిఒక్క విద్యార్థి వేసవి శిబిరంలో పాల్గొని అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇక్కడ నేర్చుకున్న అంశాలను జీవితంలో ఎదగడానికి విద్యార్థినిలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. 15 రోజులపాటు ఈ క్యాంపు ఉంటుందని, జిల్లాలోని 20 కేజీబీవీల నుంచి విద్యార్థినులు క్యాంపునకు హాజరయ్యేలా చొరవ చూపిన కేజీబీవీల ప్రత్యేకాధికారులకు డీఈఓ కృతజ్ఞతలు తెలిపారు. క్యాంపులో భాగంగా విద్యార్థినులకు స్పోకెన్ ఇంగ్లిష్, స్పీడ్ మ్యాథ్స్, డ్యాన్స్, మ్యూజిక్, యోగా, మెడిటేషన్, కంప్యూటర్, కోడింగ్, పెయింటింగ్ తదితరవి నేర్పిస్తారన్నారు. కార్యక్రమంలో జీడీసీఓ శోభారాణి, ఎంఈఓ శంకర్‌నాయక్, కల్వకుర్తి కేజీబీవీ ప్రత్యేకాధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


