నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ప్రస్తుత ఎంపీ పోతుగంటి రాములు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరైన ఈ సమావేశానికి ఎంపీకి ఆహ్వానం అందలేదని తెలిసింది. ఎంపీకి సమాచారం లేదన్న విషయం తెలుసుకున్న కేటీఆర్ ఆయన పీఏ ద్వారా ఫోన్ చేయించగా.. ఇప్పుడు చెబితే తాను రాలేనని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎంపీ రాములుతోపాటు ఆయన కుమారుడు, కల్వకర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్‌కుమార్ పార్టీ మారుతారనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన గైర్హాజరు కావడం బలం చేకూరుస్తోంది. కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఆయన సన్నిహితులు, అనుచరులతో పార్టీ మారే విషయమై మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన అభిమానులు, అనుచరులు, ముఖ్యులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు వినికిడి. మొదటగా కుమారుడు భరత్‌కు నాగర్‌కర్నూల్ జెడ్పీ చైర్మన్ పదవి కోసం రెండుసార్లు ప్రయత్నించగా పార్టీ పట్టించుకోలేదు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట టికెట్ ఆశించి భంగపడ్డారు. బీఆర్‌ఎస్‌లో వరుసగా జరుగుతున్న అవమానాలతో పార్టీలో ఉండటం కంటే మారడమే సమంజసం అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.