ములుగు: జ్వరంతో బాధపడుతున్న గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రక్త నమూనాలు సేకరించి మలేరియా నిర్ధారణ అయితే పూర్తిస్థాయి చికిత్స అందించాలని కీటక జనిత వ్యాధుల నియంత్రణ రాష్ట్ర అదనపు సంచాలకురాలు డాక్టర్ పద్మజ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. గొత్తికోయగూడేల్లో రక్తహీనత కేసులను గుర్తించి న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదు అవుతున్న మలేరియా, డెంగీ కేసుల వివరాలను జిల్లా కార్యాలయానికి పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జ్వరపీడితులకు ఆర్‌డీటీ పరీక్షలతో పాటు రక్త నమూనాలను సేకరించి మైక్రోస్కోపిక్ పరీక్షలు నిర్వహించాలన్నారు. డెంగీ నిర్ధారణ అయితే ఎలీషా పరీక్ష కోసం ములుగు టీ–హబ్‌కు నమూనాలు పంపాలని తెలిపారు. కేసులు గుర్తించిన గ్రామాల్లో జిల్లా ర్యాపిడ్ యాక్షన్ టీమ్‌లతో నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు, డిప్యూటీ డైరెక్టర్ విజయ్‌కుమార్, జోనల్ మలేరియా అధికారి విశ్వశాంతి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్, జిల్లా ప్రోగ్రాం అధికారులు రవితేజ, దుర్గారావు, హెచ్‌ఈఓ సతీష్, సబ్ యూనిట్ అధికారులు వెంకట్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, సాంబయ్య, సూపరింటెండెంట్ విజయబాబు, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
కీటక జనిత వ్యాధుల నియంత్రణ రాష్ట్ర అదనపు సంచాలకురాలు పద్మజ


