ప్రలోభాల ఎర
ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం
ప్రచారానికి
తెర..
ములుగు: ములుగు మున్సిపాలిటీ ఎన్నికలకు సమరం మొదలైంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. మందు, మాంసాహారం, నగదు రూపేణా ఆశపెడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ తమకే ఓటేసి గెలిపించాలని ప్రాధేయపడుతున్నారు. ములుగు మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ధీమాతో అభ్యర్థులు ఓటర్లకు పంచేందుకు మందు, చీరలు ముందస్తుగానే సమకూర్చుకున్నారు. ఇప్పటికే కొన్ని వార్డుల్లో రోజుకు కిలో చికెన్, క్వాటర్ బాటిల్ చొప్పున ఓటర్లకు పంపిణీ చేస్తూ తమకే ఓటేసి గెలిపించాలని అభ్యర్థులు వేడుకుంటున్నారు.
పోటీలో 83 మంది..
తొలిసారిగా ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీ పరిధిలో బండారుపల్లి, జీవింతరావుపల్లి గ్రామాలు విలీనం అయ్యాయి. 20 వార్డులకు 83 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చైర్‌పర్సన్ రిజర్వేషన్ బీసీ మహిళకు కేటాయించడంతో చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకోవాలనే ఆలోచనలో అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. బీఆర్‌ఎస్, బీజేపీలు 20 వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ కొన్ని చోట్ల బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పోటీ పడుతుంది. బీజేపీ ఒకటి, రెండు చోట్ల పోటీ ఇస్తుందనే ప్రచారం సాగుతోంది. 20 వార్డులకు కాంగ్రెస్ నుంచి 20 మంది, బీఆర్‌ఎస్ నుంచి 20, బీజేపీ నుంచి 20, సీపీఎం నుంచి ఇద్దరు, స్వతంత్రులు 21 మంది పోటీపడుతున్నారు.
11న పోలింగ్
ములుగు మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. 20 వార్డులకు 20 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా 50 బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేశారు.. మున్సిపాలిటీ ఎన్నికల్లో 13,963 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 6,661 మంది పురుషులు, 7,300 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. ఎన్నికల విధులకు ఏడుగురు ఆర్‌ఓలు, ఏడుగురు ఏఆర్‌ఓలు, 74 మంది ఏపీఓలను నియమించినట్లు మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ తెలిపారు.
రేపే పోలింగ్
20 వార్డులకు.. 83 మంది అభ్యర్థుల పోటీ
కాంగ్రెస్ హవా కొనసాగేనా..
గ్రామపంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ అదే ఊపుతో మున్సిపల్ ఎన్నికల్లో జోరుగా ముందుకెళ్తోంది. మంత్రి సీతక్క నిత్యం అభ్యర్థులకు, ఓటర్లకు అందుబాటులో ఉంటూ 20 వార్డులకు 20 గెలుచుకోవాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. బీఆర్‌ఎస్ నుంచి జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని ఆశించిన సకినాల భవాని చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, చైర్‌పర్సన్ పదవిని ఆశించిన మాజీ ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, సుధీర్ బీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్‌కు బలం చేకూరింది. అయినప్పటికీ మాజీ మంత్రి సత్యవతిరాధోడ్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి బీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం కోసం ప్రతిరోజు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ దూకుడు కొనసాగుతుందా, బీఆర్‌ఎస్ పుంజుకుంటుందా అనేది ఈ నెల 13న వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
ప్రలోభాల ఎర


