వందశాతం పోలింగ్ లక్ష్యం
● కలెక్టర్ టీఎస్.దివాకర
ములుగు: మున్సిపాలిటీ ఎన్నికల్లో వందశాతం పోలింగ్ నమోదు చేసేలా అధికారులు లక్ష్యం పెట్టుకోవాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సోమవారం విలేకరులకు పలు వివరాలు వెల్లడించారు. రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సాధారణ సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు సంస్థలు, ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థల భవనాల్లో విధులు నిర్వహించబోయే వారందరికీ ఈ నెల 10, 11, 13వ తేదీల్లో సెలవును ప్రకటించినట్లు తెలిపారు. ఓటర్లు తప్పకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
144 సెక్షన్ అమలు
ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 12వ తేదీ సాయంత్రం 5గంటల వరకు 72 గంటల పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని వెల్లడించారు.. 144 సెక్షన్ అమలులో ఉన్న నేపధ్యంలో గుంపులుగా ఉండడం, ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ములుగు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను కలెక్టర్ దివాకర సోమవారం రాత్రి సందర్శించారు. సిబ్బందికి పొలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలని పలు సూచనలు చేశారు. బీఎల్‌ఓలు ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


