చైర్మన్‌ పీఠంపైనే నజర్‌! | - | Sakshi
Sakshi News home page

చైర్మన్‌ పీఠంపైనే నజర్‌!

Jan 31 2026 10:29 AM | Updated on Jan 31 2026 10:29 AM

చైర్మన్‌ పీఠంపైనే నజర్‌!

చైర్మన్‌ పీఠంపైనే నజర్‌!

ముగిసిన నామినేషన్ల పర్వం

అనుచరులకు టికెట్లు.. కాంగ్రెస్‌ నేతల యత్నాలు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌లో 12 మున్సిపాలిటీల్లో పాగా వేయడమే మూడు ప్రధాన పార్టీల లక్ష్యం. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటా పోటీగా కొట్లాడిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో చివరకు కాంగ్రెస్‌ ఆధిక్యతను చాటింది. బీజేపీ సైతం గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే అత్యధికంగా స్వా ధీనం చేసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో కి వచ్చిన తర్వాత తొలిసారిగా పార్టీ గుర్తులపై ఎన్ని కలు జరుగుతున్నాయి. ఆ పార్టీతో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈక్రమంలో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఆ మూడు పార్టీ లు కూడా గెలుపు గుర్రాలవైపు చూస్తున్నాయి. నా మినేషన్ల గడువు శుక్రవారంతో ముగిసినప్పటికీ.. శనివారం నాటికి ‘బి’ ఫామ్‌లను సమర్పించే అవకాశం ఉండడంతో ఈలోగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.

గెలుపు గుర్రాలవైపే మొగ్గు

ఉమ్మడి వరంగల్‌లో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ), 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మినహా మిగతావాటికి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో మూడు జనరల్‌ (పరకాల, వర్ధన్నపేట, తొర్రూరు)కు, ఒకటి జనరల్‌ మహిళ (మరిపెడ)కు, రెండు బీసీ జనరల్‌ (జనగామ, భూపాలపల్లి)కు, రెండు బీసీ మహిళ (నర్సంపేట, కేసముద్రం)కు కేటాయించారు. అలాగే ఎస్టీ మహిళలకు రెండు (మహబూబాబాద్‌, ములుగు), ఎస్సీ జనరల్‌కు రెండు (డోర్నకల్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌)లు రిజర్వ్‌ చేశారు. అయితే రిజర్వేషన్ల వారీగా మున్సిపల్‌ పీఠాలపై కన్నేసిన ప్రధాన పార్టీలు.. గెలిచే అవకాశం ఉన్న వారిని వార్డు కౌన్సిలర్‌గా ఎంపిక చేస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు శుక్రవారం అంతా కసరత్తు చేసి జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఒక్కో వార్డుకు ఒక్కో పార్టీకి ఇద్దరు నుంచి నలుగురు వరకు నామినేషన్లు వేశారు. శనివారం ‘బి’ఫామ్‌ల సమర్పించే ప్రక్రియ ఉండగా.. అవకాశం దక్కని వారిని బుజ్జగించేందుకు కూడా నాయకులు సిద్ధమయ్యారు. భారతీయ జనతా పార్టీ మాత్రం మున్సిపల్‌ ఎన్నికలపై అంతగా కసరత్తు చేస్తున్నట్లు కనిపించడం లేదు.

పార్టీల దూకుడు.. ఆశావహుల యత్నాలు

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు మరో 11 రోజులే ఉండడంతో అభ్యర్థుల ఎంపిక మొదలు.. గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తించే వరకు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించే పనిలో పడ్డాయి. మున్సిపల్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌లుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ను ఇప్పటికే నియమించింది. వారు ఉమ్మడి వరంగల్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నాయకులతో ఎన్నికలపై సమన్వయం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు జిల్లాల ఇన్‌చార్జ్‌లతో పాటు 12 మున్సిపాలిటీలకు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్‌ ఎన్నికలపై బీజేపీ ఇంకా ఆ పార్టీ గెలుపు వ్యూహం ఏంటి? ఇన్‌చార్జ్‌లు ఎవరనేది స్పష్టం చేయకపోగా, అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు మాత్రం ప్రకటించింది. సీపీఐ, సీపీఎం పార్టీలు బలమున్నచోట వార్డు కౌన్సిలర్లను పోటీలో దింపడంతో పాటు అవకాశం ఉన్న చోట ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడం, తీసుకోవాలన్న యోచన కూడా చేస్తున్నట్లు ప్రచారం. ఇదిల ఉంటే ఇప్పటికే నామినేషన్లు వేసి ‘బి’ఫామ్‌ల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతల చుట్టూ చక్కర్లు కొడుతుండగా.. ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరనేది నేడు తేలనుంది.

మొత్తం 199 నామినేషన్ల స్వీకరణ

ములుగు: ములుగు మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు 199 నామినేషన్లు దాఖలు అయినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌ శుక్రవారం తెలిపారు. తొలి రోజు 4, రెండో రోజు 61, మూడవ రోజు 134 నామినేషన్లు (మొత్తం 199) దాఖలు అయినట్లు ఆయన తెలిపారు.

మెజార్టీ స్థానాలపై బీఆర్‌ఎస్‌..

బీజేపీ నాయకుల గురి

గెలుపు గుర్రాలకే పార్టీ బీఫామ్‌లు..

నేడే అభ్యర్థులు తేలేది

మూడు పార్టీలకు

సవాల్‌గా మారిన ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement