విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలి
ములుగు రూరల్: విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుంటేనే కంటి సమస్యలు రాకుండా ఉంటాయని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు పౌష్టికాహారం కలిగిన ఆహార పదార్ధాలతో పాటు ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, పాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ టీవీ, మొబైల్ చూడడం తగ్గించుకోవాలని సూచించారు. యోగాతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. జిల్లాలో 19,090 మంది విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. 1,222 విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. 24 మంది విద్యార్థులకు కంటి సమస్యలపై ఉన్నత శ్రేణి ఆస్పత్రులకు రెఫర్ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు శ్రీకాంత్, సంపత్, తిరుపతి పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు


