నిబంధనల మేరకే ఖర్చు చేయాలి
వాజేడు: జీపీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనల మేరకే ఖర్చు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు మానస తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మండల కేంద్రానికి వచ్చిన ఆమె రైతు వేదికలో పోటీలో ఉన్న అభ్యర్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ. 1.50 లక్షలు, వార్డు మెంబర్ రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చని వెల్లడించారు. అంతకు మించి ఖర్చు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. నిబంధనల కంటే ఎక్కువగా డబ్బు తీసుకెళ్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా వారి ఖర్చుల వివరాలను మూడుసార్లు విచారణ జరిపించుకోవాలని సూచించారు. మండలంలో ఫ్లయింగ్ స్క్వాడ్, ఎన్‌సీసీ టీం తిరుగుతుందని తెలిపారు. నిబంధనల కంటే ఎక్కువ ఖర్చు చేసిన అభ్యర్థి పోటీల్లో గెలిచినా ఆ విషయం ఫిర్యాదు రూపంలో వస్తే విచారించి నిజమని తేలితే ఆ గెలుపును రద్దు చేసే అవకాశం ఉందన్నారు. మైక్‌తో ప్రచారం చేయాలనుకుంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ విజయ, తహసీల్దార్ శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్రీకాంత్ నాయుడు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు మానస
నిబంధనల మేరకే ఖర్చు చేయాలి


