ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మహాజాతరలో ట్రాఫిక్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. మండల పరిధిలోని అడవిమార్గంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యామ్నాయ దారులను డీఎస్పీ రవీందర్‌తో కలిసి ఎస్పీ బైక్‌పై తిరుగుతూ శుక్రవారం పరిశీలించారు. మహావీర్ పార్కింగ్ నుంచి వెంగ్లాపూర్, గోనెపల్లి మీదుగా కొండపర్తి, కాల్వపల్లి నుంచి అడవి మార్గంలోని దారులను తనిఖీ చేశారు. మేడారం మహాజాతర సమయంలో భారీ సంఖ్యలో భక్తులు ప్రైవేట్ వాహనాల్లో రానున్న నేపథ్యంలో రహదారి వెడల్పు, మలుపులు, సేఫ్ జోన్‌లు, ట్రాఫిక్ డైవర్షన్‌కు అనుకూల ప్రాంతాల వివరాలను తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కొండపర్తి రూట్‌ను కూడా ఉపయోగించుకునే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. మేడారం జాతర సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మార్గమధ్యలో సైన్ బోర్డ్స్, రేడియం స్టికర్స్, సిగ్నలింగ్ టీమ్స్, పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట పస్రా సీఐ దయాకర్ ఉన్నారు.
వాహనదారులు అప్రమత్తం
ములుగు రూరల్: చలికాలంలో ఉదయం పొగమంచు కారణంగా వాహనాలు నడిపే వారు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఉదయం సమయంలో వాహనదారులు ఫాగ్‌లైట్లు, హెడ్ లైట్లు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. వాహనాలను ఓవర్ స్పీడ్‌గా నడపరాదని తెలిపారు. ముందు వెళ్తున్న వాహనాలు సరిగా కనిపించని కారణంగా సురక్షిత దూరం పాటించాలని, ఇతర వాహనదారులను అప్రమత్తం చేసేందుకు హారన్ ఉపయోగించాలని సూచించారు. రోడ్డు పక్కన వాహనాలు నిలుపవద్దని పేర్కొన్నారు. డ్రైవర్లు నిద్రలేమి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని హెచ్చరించారు. ఉదయం వాకింగ్ చేసే వారు హైవేలపై కాకుండా నిర్ణీత మైదానాల్లో వ్యాయామం చేయాలని సూచించారు. చలికాలంలో అత్యవసరమైతే తప్పా ఉదయం 5 నుంచి 8 గంటల వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో 100, 112 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
బైక్‌పై అడవిమార్గం దారుల పరిశీలన


